‘దురంధర్’ సక్సెస్ తనకెంతో ప్రత్యేకమని అంటున్నది సౌత్ సెన్సేషన్.. సారా అర్జున్. ఈ సినిమా చూసి తన తల్లిదండ్రులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారని, వాళ్ల ఎమోషన్ తనకు ఆనందాన్ని కలిగించిందని చెబుతున్నది. బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టిన సారా అర్జున్.. ప్రస్తుతం హీరోయిన్‌గానూ రాణిస్తున్నది. కెరీర్ తొలినాళ్లలోనే అగ్ర దర్శకుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నది.
తాను నటించిన సినిమాలన్నీ హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా రాబట్టాయి. దాంతో, సారాది ‘గోల్డెన్ లెగ్’ అంటూ.. ఇండస్ట్రీ వర్గాల్లో చర్చసాగుతున్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణాన్ని పంచుకున్నది. మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఎన్నో కలలు కన్నాననీ, ‘పొన్నియిన్ సెల్వన్’తో ఆ కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. అందుకే, ఆ సినిమాలో నటించిన రోజులను తానెప్పటికీ మర్చిపోలేనని అంటున్నది.
ఈ సినిమా పూర్తయిన తర్వాత నటనలో మరింత నైపుణ్యం సాధించడానికి విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నదట. అదే సమయంలో గుణశేఖర్ ‘యుఫోరియా’ కథ వినిపించడంతో.. ఈ సినిమాలో తప్పకుండా నటించాలని అనుకున్నదట. “యుఫోరియా లాంటి కథలో భాగమయ్యే అవకాశం కొందరికే వస్తుంది. అలాంటి చాన్స్ దక్కడం నిజంగా నా అదృష్టం” అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక దురంధర్ సినిమా చూసి.. వాళ్ల అమ్మానాన్న సంతోషంతో ఏడ్చేశారట.
ఆ దృశ్యం తానెప్పటికీ మర్చిపోలేనని, ఆ సంఘటన తన జీవితంలోనే ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చింది. దక్షిణాదిలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన సారా అర్జున్.. నాన్న, దాగుడుమూత దండాకోర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆతర్వాత ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి.. ‘దురంధర్’తో భారీ హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘యుఫోరియా’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం కాబోతున్నది.