అభిమానులు ఆమెను ఫైర్‌బ్రాండ్ అని అభివర్ణిస్తారు. నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగే తెగువ కలిగిన ధీరవనిత అంటూ కీర్తిస్తారు. ప్రత్యర్థులేమో వివాదాల సహవాసి, నిత్యం కలహప్రియురాలు అంటూ విమర్శిస్తారు. ఎవరేమన్నా తన మార్గం అభేద్యం అంటున్నది అగ్ర కథానాయిక కంగనారనౌత్. రంగులప్రపంచంలోని అన్యాయాలపై ధిక్కార స్వరం వినిపిస్తానని చెబుతున్నది. నాలుగుసార్లు జాతీయ అవార్డుగ్రహీతగా అసమాన ప్రతిభతో హిందీ చిత్రసీమలో దూసుకుపోతున్న కంగనారనౌత్ టైటిల్ రోల్‌ని పోషించిన తాజా చిత్రం ‘తలైవి’. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. ఈ నెల 10 న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కంగనారనౌత్ పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకుంది.
‘తలైవి’ చిత్రానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నుంచి భారీ ఆఫర్లొచ్చాయి. అయినా థియేటర్లో మాత్రమే చూడాల్సిన చిత్రమిదని వేచిచూశాం. ఓ నటిగా నేను కూడా థియేటర్లోనే సినిమాలు చూడాలని కోరుకుంటా. మేమంతా థియేటర్లు సృష్టించిన ఇమేజ్ మీదనే ఇందాక వచ్చాం.
జయలలిత పాత్రను ఆకళింపు చేసుకొని అభినయించడానికి ఎలాంటి కసరత్తులు చేశారు?
బరువు పెరగడం, తగ్గడమే అసలైన సవాలుగా అనిపించింది. 16 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు జయలలిత జీవితంలో ముఖ్యఘట్టాల్ని ఆవిష్కరిస్తూ ఈ బయోపిక్ సాగుతుంది. ఆమె యవ్వనం నాటి రోజులకు సంబంధించిన ఘట్టాల్లో బరువు తగ్గి కనిపించాల్సి వచ్చింది. రాజకీయ జీవితానికి సంబంధించిన సన్నివేశాల్లో చాలా బరువు పెరిగి కనిపించాను. ఇలా శారీరకమైన రూపభేదం చూపించడమే కాస్త ఛాలెంజ్‌గా అనిపించింది. ఇక తమిళ రాజకీయాలు, సినిమాల మీద నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు కాబట్టి విస్త్రతమైన పరిశోధన చేసి అనేక విషయాల్ని తెలుసుకున్నా.
ఆమె జీవితంలోని సంఘర్షణ గురించి తెలుసుకున్నప్పుడు ఓ మహిళగా మీరు ఎలా ఫీలయ్యారు?
పాతాళం నుంచి శిఖరాన్ని అధిరోహించిన ధీరోదాత్తురాలు జయలలిత. చిన్నతనంలో తండ్రిని కోల్పోయి, ఎలాంటి నేపథ్యంలేని ఓ సాధారణ యువతి వజ్రసంకల్పంతో జీవితాన్ని జయించిన తీరు అందరికి స్ఫూర్తిదాయకం. అనేక పరిమితులు, ఆంక్షల్ని ఛేదించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు పర్యాయాలు పనిచేసింది. జయలలిత ప్రయాణాన్ని చూస్తే నా సినీ కెరీర్‌కు చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు కనిపించింది. దాంతో తెలియకుండానే ఆమె జీవితంతో కనెక్ట్ అయ్యాను. షూటింగ్ ఆరంభం నుంచే నేను జయమ్మ అభిమానిగా మారిపోయా.
జయలలితతో మీకు ఎలాంటి పోలికలు ఉన్నాయనుకుంటున్నారు?
సమస్యపై పోరాడే సమయంలో ఆమె ఎవరినీ లెక్కచేసేది కాదు. చూసేవారికి అహంభావిగా కనిపించేది. నాలో అవే లక్షణాలు ఉన్నాయి. జయలలిత సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘జూనియర్ ఆర్టిస్ట్ కూతురు హీరోయిన్గా ఎలా సక్సెస్ అవుతుంది’ అని విమర్శించేవారట. బాలీవుడ్‌కు వచ్చిన తొలిరోజుల్లో నా హిందీ యాస గురించి కామెంట్స్ చేసేవారు. పర్వతప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయంటూ అవహేళనగా మాట్లాడేవారు. ఎన్నో ప్రతికూలతలు ఉన్నప్పటికీ మొక్కవోని సంకల్పంతో నేను అగ్ర కథానాయికగా ఎదిగాను. అలా మా ఇద్దరి సినీ జీవితం మధ్య కొన్ని సారుప్యతలు కనిపిస్తాయి.
రాజకీయపరమైన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. భవిష్యత్తుల్లో రాజకీయాల్లో అరంగేట్రం చేసే ఆలోచన ఏమైనా ఉందా?
ప్రస్తుతానికైతే రాజకీయ ఆకాంక్షలు ఏమీ లేవు. మరికొన్నేళ్లు పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టిపెడతా. కేవలం హిందీకి మాత్రమే పరిమితమై పోకుండా ‘తలైవి’ వంటి పాన్ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువకావాలని ఉంది. సినీరంగంలో ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయనుకుంటున్నా. ఇక్కడ అన్నీ సాధించిన తర్వాతే రాజకీయ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకుంటా.
ఈ సినిమా చేసిన తర్వాత మీ రాజకీయదృక్పథంలో ఏమైనా మార్పులొచ్చాయా?
రాజకీయాలంటే అవినీతి, అక్రమాలు అనే అభిప్రాయం ఉండేది. ‘తలైవి’ చేసిన తర్వాత రాజకీయాలపై నాకున్న దృక్కోణం మొత్తం మారిపోయింది. రాజకీయం అంటే నిరంతరం ఎత్తుకుపై ఎత్తులతో సాగే చదరంగం అని అర్థమైంది. సినీతారల శుక్రవారం వస్తుందంటే ఒత్తిడికి లోనవుతారు. తమ సినిమాల ఫలితమేమిటో అనే ఆందోళన ఉంటుంది. అయితే సినిమాల్లో ఒకటి ఫెయిలైనా వెంటనే మరో ప్రయత్నం చేసుకోవచ్చు. కానీ రాజకీయాలు అలా కాదు. ఐదేళ్లపాటు వేచి చూడాలి. రాజకీయాల్లో విజయం కోసం ఓ జీవితకాలం కష్టపడాల్సి ఉంటుంది. శారీరక, మనోశక్తులకు ఎప్పటికప్పుడు పదునుపెడుతుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఇమేజ్ను కాపాడుకుంటూ, అపజయాల్ని ఓర్చుకుంటూ ప్రయాణం సాగించడం ఓ యజ్ఞంలాంటిది.
హిందీ ఏరియాలో ఈ సినిమా థియేటర్ రిలీజ్ వివాదాల్ని ఎలా పరిష్కరించుకోబోతున్నారు?
హిందీ బెల్ట్‌లో ఈ సినిమా విడుదల కష్టంగా మారింది. నాకు సహాయనిరాకరణ చేస్తున్నారు. ఓటీటీకి రెండువారాల విండో పీరియడ్ సరిపోదనే సాకుతో సినిమాను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ‘రాధే’వంటి భారీ సినిమాతో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేశారు. నా సినిమాపై మాత్రం కక్ష్యపూరితంగా వ్యహరిస్తున్నారు. అగ్రహీరోల చిత్రాలకు సానుకూలంగా ఉంటూ హీరోయిన్స్ ప్రధాన సినిమాల్ని అడ్టుకుంటున్నారు. ఇలాంటి గ్యాంగిజమ్ పోవాల్సిన అవసరముంది.
సినీరంగంలో ఉండే పోటీతత్వం, కలెక్షన్ల లెక్కల గురించి మీరెమంటారు?
కెరీర్లో ప్రతి ఒక్కరు ఎదగాలని, పరిణితి సాధించాలని కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. అయితే నాయికగా నేను ఒకే మూసకు పరిమితమై పోకుండా అన్ని కోణాల్లో నా ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నా. నటనతో పాటు దర్శకురాలిగా రాణిస్తున్నా. నిర్మాణ వ్యవహరాల్ని చూసుకుంటున్నా. కథా, సంభాషణల రచనపై కూడా ఆసక్తి పెంచుకున్నా. ఇక నా దృష్టిలో సినిమాకు కలెక్షన్స్ చాలా అవసరం. కొన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు వసూళ్ల గురించి తప్పకుండా ఆలోచించాలి.
హిందీ చిత్రసీమలోని పురుషాధిపత్యం, బంధుప్రీతిపై పోరాటం చేస్తున్నారు. అది ఎంతవరకు సఫలీకృతమైనందనుకుంటున్నారు?
బాలీవుడ్ ఇండస్ట్రీలోని అసమానతలు, అవుట్‌సైడర్స్ పట్ల వివక్ష, మాఫియా రాజకీయాలపై నేను పోరాడుతూనే ఉన్నా. అది కొనసాగుతూనే ఉంటుది. పరిశ్రమలో స్నేహతత్వం, సహకారగుణం విషయాల్లో దక్షిణాది చిత్రసీమ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు మైత్రీభావంతో ఉంటారు. ఒకరి సినిమాల్ని మరొకరు మెచ్చకుంటుంటారు. బాలీవుడ్లో సినిమాపై అంతగా ప్రేమ ఉండదు. రాజకీయాలు, కుట్రలు తప్ప మరేవి కనిపించవు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రెండుసార్లు, బీజేపీ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు నేను జాతీయ అవార్డులు స్వీకరించాను కాబట్టి పురస్కారాల్ని వివాదం చేసేవారికి నేను బదులివ్వను. ‘తలైవి’ చిత్రానికి జాతీయ అవార్డు గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ప్రతి ఏడాది ఎంతో మంది నాయికలు మంచి పాత్రల్ని చేస్తున్నారు. వారిలోంచి ఉత్తమమైన పర్ఫార్మెన్స్ను ఎంచుకుంటారు. ప్రస్తుతానికైతే ‘తలైవి’లో నా పాత్రను ప్రేక్షకులు గొప్పగా ఆశీర్వదిస్తే చాలనుకుంటున్నా.