ఓటీటీ విండో అమలు కోసం పాటించాల్సిన కఠినమైన మార్గదర్శకాలపై చర్చించేందుకు దక్షిణాది చిత్ర నిర్మాతలు, నిర్మాతల సంఘాలు, గిల్డ్ల ప్రతినిథులు ఆదివారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. థియేటర్లలో విడుదలైన నెలరోజులకే సినిమా ఓటీటీలోకి వచ్చేయడం వల్ల థియేటర్లకు నష్టం వాటిల్లుతున్నదని, విడుదలైన ఎనిమిదివారాల తర్వాతే సినిమాను ఓటీటీకి ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరడంతో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తదనంతరం దక్షిణాది నిర్మాతలంతా కలిసి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(SIFPA) ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు.
అసోషియేషన్ ఏర్పాటుపై నిర్మాతలంతా అంగీకారం తెలిపారు. దక్షిణాది భాషలకు చెందిన నిర్మాతలందర్నీ సమన్వయం చేయడానికీ, తక్షణ సవాళ్లపై చర్చించడానికీ ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు. ఏ సంఘం లేదా ఏ సంస్థ ప్రభావం లేకుండా కేవలం తమ నిబంధనలతో మాత్రమే ముందుకు వెళ్లాలని, ఓటీటీ రీలీజ్ల విషయంలో ఎలాంటి లేఖలు జారీ చేయకూడదని నిర్మాతలంతా సమిష్టిగా నిర్ణయాలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యల కోసం నిర్మాతలంతా మరోసారి సమావేశం కానున్నారు.