Mohan Babu | టాలీవుడ్ దివంగత నటి సౌందర్య ఆస్తిని సీనియర్ నటుడు మోహన్ బాబు కబ్జా చేశాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. సౌందర్య అభిమాని అయిన ఖమ్మం జిల్లాకు చెందిన ఏదురుగట్ల చిట్టిబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. నటి సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణమని సంచలన ఆరోపణలు చేశారు. 2004లో విమాన ప్రమాదంలో మరణించిన సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందని, అలాగే హైదరాబాద్‌లోని జల్పల్లిలో మోహన్ బాబు నివసిస్తున్న టౌన్షిప్ సౌందర్య సొంతమని, దాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక, మోహన్ బాబు నుండి తనకు ప్రాణహాని ఉందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. పలు తెలుగు ఛానల్స్ కూడా ఈ వార్తలు నిజమే అనుకుని వార్తలను ప్రచురించాయి. అయితే మోహన్‌బాబుపై వస్తున్న ఆరోపణలను తాజాగా ఖండించాడు సౌందర్య భర్త రఘు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.
హైదరాబాద్‌లోని సౌందర్య ఆస్తికి సంబంధించి గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతుంది. సౌందర్య ఆస్తిని మోహన్‌బాబు కబ్జా చేశాడంటూ వస్తున్న వార్తలను నేను ఖండిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మోహన్ బాబు – సౌందర్య మధ్య ఎటువంటి భూ లావాదేవీలు జరుగలేదు. మోహన్‌బాబు నాకు ఎప్పటినుంచో తెలుసు. వారి కుటుంబంతో మాకు గత 25 ఏండ్ల నుంచి మంచి రిలేషన్ ఉంది. నేను మోహన్ బాబుని ఎంతో గౌరవిస్తాను. మేమంతా ఒక ఫ్యామిలీగా ఉంటాం. మాకు ఎటువంటి ఆస్తి గొడవలు లేవు. అందుకే ఈ విషయం అందరికీ తెలియాలని లేఖ విడుదల చేశాను.
దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపండంటూ రఘు చెప్పుకోచ్చాడు.