Sood Charity Foundation | వెండితెరపై విలన్‌గా మెప్పించినా నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. తాజాగా ఆయన తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయించి మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం చికిత్స అందించడమే కాకుండా, క్యాన్సర్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళలకు పునర్జన్మను ప్రసాదించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.
ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. దేశంలో మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే తన లక్ష్యమని, ఈ విజయం తన బృందం మరియు వైద్యుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ రహిత భారతదేశం కోసం మరిన్ని భారీ కార్యక్రమాలు చేపడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2025లో తన 52వ పుట్టినరోజు సందర్భంగా 500 మంది వృద్ధుల కోసం అత్యాధునిక వృద్ధాశ్రమాన్ని ప్రకటించిన ఆయన, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో ప్రతిష్టాత్మక ‘హ్యూమానిటేరియన్ అవార్డు’ను కూడా అందుకున్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌తో జతకట్టి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ అవేర్నెస్ కోసం పనిచేస్తున్న సోనూసూద్ చేస్తున్న ఈ అద్భుతమైన సేవలను చూసి యావత్ దేశం ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.