Sonu Sood | రీల్ లైఫ్‌లో విలన్‌గా నటించి అలరించిన సోనూసూద్ రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో మంది మన్ననలు పొందుతున్నారు. కోవిడ్ సమయంలో వేలాది మందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్, ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జూలై 30న తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవలో మరో మైలురాయిగా నిలిచే వృద్ధాశ్రమం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సోనూసూద్ ఏర్పాటు చేస్తున్న ఈ వృద్ధాశ్రమంలో 500 మంది నిరాశ్రయ వృద్ధులకు నూతన జీవితాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది కేవలం తల దాచుకునే చోటు మాత్రమే కాదు… వారికి అవసరమైన వైద్య సహాయం, పౌష్టికాహారం, ప్రేమతో కూడిన వాతావరణం అందించడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. వృద్ధుల జీవితంలో గౌరవంతో కూడిన మూడో ఇన్నింగ్స్‌కి ఇది సహాయపడుతుందని తెలిపారు. కరోనా సమయంలో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చడం, ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఆహార మరియు నివాస సౌకర్యాలు కల్పించడం వంటి సేవలతో సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. అప్పటి నుంచి ప్రజల దృష్టిలో దేవుడిగా మారారు.
ఆ తర్వాత కూడా విరామం లేకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు, రైతులకు సహాయం, వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. తన స్వంత ట్రస్ట్ ద్వారా అనేక మందిని ఆదుకున్నారు. ఈ అంకితభావానికి గుర్తింపుగా, ఇటీవలే మిస్ వరల్డ్ 2025 ఫైనల్స్ వేడుకలో సోనూసూద్‌కు ప్రతిష్టాత్మక మానవతావాది అవార్డు కూడా లభించింది. ఇది ఆయన చేస్తున్న సేవలకు గౌరవ సూచకం. ఇప్పుడు 52వ వసంతంలోకి అడుగుపెట్టిన సోనూసూద్, తన పుట్టినరోజును మరో సామాజిక సేవా ప్రాజెక్టుతో ప్రారంభించడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో ‘ #RealHeroSonuSood ’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నెటిజెన్లు, సెలబ్రిటీలు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.