Sonu Nigam | బాలీవుడ్ సింగర్ సోనూనిగమ్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కూడా కన్నడ ప్రజలు మాత్రం అతడిని క్షమించేలా కనపడట్లేదు. తాజాగా అతడి పాడిన పాటను సినిమా నుంచి తొలగించినట్లు కులదల్లి కీల్యావుడో(Kuladalli Keelyavudo) అనే చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా.. ప్రకటన విడుదల చేసింది.
“సోను నిగమ్ గొప్ప గాయకుడని మాకు తెలుసు. అయితే, ఇటీవల ఆయన కన్నడ భాష గురించి మాట్లాడిన విధానం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. కన్నడ భాషకు జరిగిన ఈ అవమానాన్ని మేము ఎంత మాత్రం సహించలేము. అందుకే, ఆయన పాడిన పాటను చిత్రం నుండి తొలగించాలని నిర్ణయించుకున్నాము” అని పేర్కొన్నారు.
కె. రామనారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతాన్ని మనోమూర్తి అందించగా, యోగరాజ్ భట్ సాహిత్యాన్ని సమకూర్చారు. సోను నిగమ్ ఆలపించిన ‘మనసు హాడతాడే’ అనే పాట విడుదలకు ముందే శ్రోతల నుండి మంచి స్పందనను పొందింది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ వివాదం కారణంగా ఆ పాటను చిత్రం నుండి తొలగించారు. చిత్ర బృందం ఇప్పుడు ఈ పాటను తిరిగి రికార్డ్ చేయడానికి గాయకుడు చేతన్‌ను ఎంపిక చేసింది. అంతేకాకుండా, నిర్మాత సంతోష్ కుమార్ భవిష్యత్తులో సోనూ నిగమ్‌తో కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో ఒక విద్యార్థి కన్నడ పాట పాడమని కోరగా, సోనూ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “కన్నడ, కన్నడ, కన్నడ అంటూ ఇలాంటి భావజాలంతోనే కదా పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది” అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంగీత కార్యక్రమంలో ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) పేర్కొంది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) సోను నిగమ్‌తో ఉన్న అన్ని ఒప్పందాలను నిలిపివేయాలని ఆదేశించింది.