అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్ లాంటి గొప్ప నటులను హిట్లు, ఫ్లాప్‌లతో ఆధారంగా అంచనా వేయకూడదని, సినీ పరిశ్రమలోకి రావడానికి అలాంటి వాళ్లు ఎంతో స్ఫూర్తి నిస్తారని వారిని గౌరవించాలని అన్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘ఖుషి’ ప్రమోషన్లో భాగంగా తమిళనాడులో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చెప్పిన ఆసక్తికరమైన సమాధానం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్ మాట్లాడుతూ ‘చిరంజీవి, రజనీకాంత్‌లను హిట్, ప్లాఫ్లకు అతీతంగా చూడాలి.
రజనీ సార్ బ్యాక్ టు బ్యాక్ ఆరుఫ్లాప్లు ఇచ్చాడు. కానీ రీసెంట్ ‘జైలర్’లాంటి బ్లాక్‌బస్టర్‌తో మళ్లీ విజయాన్ని అందుకుని కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నాడు. చిరంజీవికి కూడా ఫ్లాప్‌లు వచ్చి వుండొచ్చు. అయితే సరైన దర్శకుడు తన ఎనర్జీని అందుకుంటే ఇటీవల సంక్రాంతికి చేసినట్లే మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. సీనియర్ నటులపై కామెంట్స్ చేయడం అగౌరవంగా భావిస్తున్నా’ అన్నారు. అయితే విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలను కొంత మంది రజనీకాంత్ అభిమానులు ఖండిస్తున్నారు. తమ అభిమాన నటుడికి వరుసగా ఆరు ఫ్లాప్‌లు రాలేదని, విజయ్ ఇలాంటి విషయాలు తెలుసుకోని మాట్లాడాలని సూచించారు.