Manjari Fadnis | ‘జానే తూ యా జానే నా’ చిత్రంతో పాటు తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘శుభప్రదం’ సినిమాలో కథానాయకిగా నటించిన ప్రముఖ నటి మంజరి ఫడ్నిస్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత వీడియోను పంచుకుంది. తమ హౌసింగ్ సొసైటీలో ఎంతో మంచిగా ఉండే ‘మైకీ’ అనే కుక్కను కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారని ఆరోపించింది. ‘మైకీ’ ని గతంలో దాని యజమానులు వదిలేసి వెళ్లగా, 2019 నుంచి తమ సొసైటీ ఆవరణలోనే ఉంటూ అందరితో ఎంతో ప్రేమగా ఉండేదని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా మైకీ కనిపించకుండా పోవడంతో, తామంతా ఎంతో ఆందోళనతో ఆ ప్రాంతమంతా వెతికామని, పోస్టర్లు వేసి సెక్యూరిటీ గార్డులను, ఇతరులను విచారించామని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే సొసైటీకి చెందిన ఒక వ్యక్తి ఈ దారుణానికి సంబంధించిన నిజాన్ని అంగీకరించాడని ఆమె కన్నీటితో వెల్లడించారు.
మైకీ బేస్మెంట్ ప్రాంతంలో ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాని తలపై కర్ర లేదా ఇనుప రాడ్తో బలంగా కొట్టారని, దాంతో అది స్పృహ కోల్పోయి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయిందని మంజరి వివరించారు. అంతటితో ఆగకుండా ఆ మూగజీవాన్ని బేస్మెంట్ నుంచి కిందకి ఈడ్చుకెళ్లి, నోటి నుండి రక్తం వచ్చేలా మళ్లీ విచక్షణారహితంగా బాదారని తెలిపారు. అనంతరం ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ జీవాన్ని ఒక గోనె సంచిలో కుక్కి వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఇంకా బతికే ఉందో లేదో కూడా తెలియదని, ప్రస్తుతం తామంతా దాని శరీరం కోసం గాలిస్తున్నామని ఆమె చెప్పారు. ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఉన్నవారు తాము ఇష్టపడని జంతువులను, ముఖ్యంగా ఎవరికీ హాని చేయని కమ్యూనిటీ కుక్కలను చట్టవిరుద్ధంగా నిర్మూలించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైకీని గుర్తుచేసుకుంటూ, పొడవాటి జుట్టుతో ఉండే ఆ కుక్కను తాము తరచుగా ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి, ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్లమని, స్నానం చేసిన తర్వాత అది ఇల్లంతా సంతోషంగా పరిగెత్తేదని మంజరి భావోద్వేగానికి గురయ్యారు. తమ మైకీ క్రూరంగా హత్య చేయబడ్డాడని, దాని న్యాయం కోసం తాము ఖచ్చితంగా పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు. ఏ సొసైటీలోనూ, ఎక్కడా కూడా ఏ కుక్కకు ఇలాంటి పరిస్థితి రాకూడదని, మూగజీవాలను హింసించాలంటేనే ప్రజలు భయపడేలా జంతు క్రూరత్వానికి వ్యతిరేకంగా మన దేశంలో మరింత కఠినమైన చట్టాలు రావాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. తమ పోరాటంలో అండగా నిలిచిన సొసైటీ సభ్యులు జేవియర్ బెర్నార్డ్ శాంటియాగో, సంకేత్ కదమ్ మరియు ఇతరులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో చూసిన భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయాతీ వంటి పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేస్తూ మంజరికి తమ మద్దతును ప్రకటించారు. నటిగా మంజరి ఫడ్నిస్ చివరగా 2025లో విడుదలైన ‘పుణే హైవే’ చిత్రంలో కనిపించారు.