Sneha Reddy | పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, స్నేహా రెడ్డి బుధవారం పరామర్శించారు. శ్రీతేజ్ నివాసానికి వెళ్లిన వారు చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ వద్ద భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందాడు. కొంతకాలం కోమాలో ఉన్న అతడు ప్రస్తుతం కోలుకుంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అరవింద్, స్నేహా రెడ్డి కొంతసేపు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. చిన్నారి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పరామర్శసమయంలో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. శ్రీతేజ్ సోదరి చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబానికి మరింత ధైర్యం లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ చిన్నారి శ్రీతేజ్ పేరు మీద రూ.2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సమాచారం. అదనంగా వైద్య ఖర్చులు, ఇతర సహాయాలతో కలిపి మొత్తం రూ.3 కోట్లకు పైగా ఆ కుటుంబానికి అందించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్టార్ హీరో కుటుంబ సభ్యులు స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించడం పట్ల స్థానికులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న అభిమాని కుటుంబానికి అండగా నిలబడటంలో అల్లు కుటుంబం పెద్ద మనసు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమాతో బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.