సినిమా పేరు : కంగువ
నటీనటలు : సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్, యోగి బాబు…
దర్శకత్వం: శివ
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్‌రాజా, వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి..
కెమెరా: వెట్రి పళణిస్వామి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
సూర్య ‘కంగువ’ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ అంచనాలు మొదలయ్యాయి. నిర్మాతలు జ్ఞానవేల్‌రాజా, వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శివ (Siva) ఈ చిత్రానికి దర్శకుడు కావడం, పైగా ఫోక్లర్ కథాంశంతో సినిమాను తెరకెక్కించడం.. వీటన్నింటినీ మించి తమిళంతోపాటు తెలుగులోనూ స్టార్ ఇమేజ్ ఉన్న సూర్య (Suriya) ఈ సినిమాకు కథానాయకుడు కావడం.. ఈ కారణాలవల్ల ఇది మరో ‘బాహుబలి’ అవుతుందేమోనని చాలామంది అంచనాలు వేసుకున్నారు. మరి అందరి అంచనాలనూ ‘కంగువ’ (Kanguva). అందుకున్నాడా? అనే ప్రశ్నకు సమధానం తెలుసుకునే ముందు.. అసలు కథేంటో చూద్దాం..
కథ:
రష్యాకు చెందిన కొందరు సైన్సిస్టులు కొందరు పిల్లలను బంధించి, వారిపై ప్రయోగాలు చేస్తుంటారు. వారి నుంచి ఓ పిల్లాడు తప్పించుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. తప్పించుకున్న పిల్లాడు ప్రాన్సిస్(సూర్య) దగ్గరకు చేరతాడు. ఆ పిల్లాడెవరో ఫ్రాన్సిస్‌కి తెలీదు. కానీ ఇబ్బందుల్లో ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. రష్యన్ దుండగలు ఆ పిల్లాడ్ని వెంబడిస్తుంటారు. ఫ్రాన్సిస్ కాపాడుతుంటాడు. అసలు ఆ పిల్లాడెవరు? ఫ్రాన్సిస్ దగ్గరకే ఎందుకు చేరాడు? ఫ్రాన్సిస్కీ ఈ పిల్లాడికీ ఉన్న సంబంధం ఏంటి? అసలు ‘కంగువ’ అంటే ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ :
ఇది పూర్వజన్మల నేపథ్యంలో సాగే కథ. ఇందులో సూర్య కంగువ, ఫ్రాన్సిస్ అనే రెండు పాత్రలు పోషించారు. వందల ఏండ్ల నాటి ఆటవికుడు కంగువ. సమకాలీన సమజానికి చెందిన వాడు ఫ్రాన్సిస్. అసలు కంగువ జీవితంలోకి పులామా అనే పిల్లాడు ఎలా వచ్చాడు? కంగువా తర్వాతి జన్మలో కూడా ఆ రుణానుబంధం ఎలా వెంటాడింది? అనేదే ఈ సినిమా పూర్తి కథ. దర్శకుడు శివ తయారు చేసుకున్న కథ నిజంగా విభిన్నమైనదే. తొలి ఇరవై నిమిషాలు కథ ప్రజెంట్లో నడుస్తుంది.. తర్వాత గతంలోకెళుతుంది. మేజర్ కథంతా గతంలోనే ఉంటుంది. కట్టుబాట్లు, పగ, ప్రతీకారాలు, పునర్జన్మలు.. ఈ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చినా.. ‘కంగువ’ కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఇదో ఆటవిక జాతికి సంబంధించిన కథ. దాంతో తెరంతా ఆటవికులే ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎక్కడా ట్రాక్ తప్పకుండా డిమాండ్ మేరకు కథ నడిపించాడు శివ. తాను ఊహించినట్టు కథను చిత్రీకరించారు. అయితే.. తెరంతా ఆటవికులే కనిపించడం.. వారి ఆహాకారాలు, ఆర్తనాదాలు, రక్తపాతం.. వీటిని ఆడియన్స్ జీర్ణించుకోగలరా? అనేది తెలియాల్సివుంది. ప్రథమార్థం అంతా కాస్త కన్ఫ్యూజన్గా సాగుతుంది. ద్వితాయార్థంలో దర్శకుడు చిక్కుముళ్లన్నీ విప్పుకుంటూ వెళ్లడంతో కథపై క్లారిటీ వచ్చేస్తుంది. దర్శకుడు శివ హాలీవుడ్ సినిమాలను ప్రేరణగా తీసుకొని ఈ కథ రాసుకున్నాడా? అనిపిస్తుంది. సన్నివేశాలు కూడా కొన్ని హాలీవుడ్ సినిమాలను గుర్తుచేస్తాయి.
నటీనటులు :
సూర్య వన్‌మ్యాన్ ఆర్మీగా ఈ సినిమాను నడిపించాడు. మొత్తంగా సినిమాను ఆయనే మోశాడు. స్వతహాగా సూర్య గొప్ప నటుడు. అందుకు తగ్గట్టే కంగువ, ఫ్రాన్సిస్ పాత్రల్లో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లో ఎమోషన్ బాగా పండించాడు. సూర్య తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర బాబీడియోల్ది. తెరపై సూర్య సర్వాంతర్యామిలా కనిపించడంలో ఆ వెలుగులో బాబిడియోల్ పాత్ర కనిపించలేదు. ఉన్నంతలో మాత్రం బాగానే చేశాడు. దిశా పటానీ పాత్ర గ్లామర్‌కే పరిమితం అయ్యింది. యోగి బాబు కామెడీ పెద్దగా పడిందేం లేదు. మొత్తంగా మిగతా నటీనటులు కూడా పరిథిమేర రక్తి కట్టించారు. చివరికి కార్తీ ఎంట్రీ ఈ సినిమాలో అందరికీ స్వీట్ షాట్. సెకండ్ పార్ట్‌లో కార్తీ కేరక్టరే మెయిన్ విలన్ అని దర్శకుడు శివ రివీల్ చేసేశాడు. కనిపించింది కొద్ది సమయమే అయినా.. ఉన్నంతలో అదరగొట్టేశాడు కార్తీ. అతని గెటప్ కూడా బావుంది.
సాంకేతికంగా..
వెట్రి పళనిస్వామి ఛాయాగ్రహణం బావుంది. సినిమాను చాలా రిచ్‌గా ప్రెజెంట్ చేశాడాయన. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే.. అవసరానికి మించి మోత మోగించాడు దేవిశ్రీప్రసాద్. పాటలు పర్లేదనిపించాయి. ఎడిటర్‌కి ఇంకాస్త పనుంది. నిర్మాతలైతే ఎక్కడా రాజీ పడకుండా గ్రాండ్‌గా సినిమాను నిర్మించారు. వారు పెట్టిన ప్రతి పైసా తెరపై కనిపించింది. మొత్తంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి, ఫిక్షన్ కథల్ని ప్రేమించేవారికి, అన్నింటికీ మించి సూర్య అభిమానులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
బలాలు..
సూర్య నటన, కథ, సినిమాటోగ్రఫీ..
బలహీనతలు..
కథనం, నేపథ్యసంగీతం, ఎడిటింగ్..
రేటింగ్..
2.75/5