‘ఈ పాట వింటుంటే దివంగత వేటూరిగారు గుర్తుకొచ్చారు. గీత రచయిత కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ఈ పాటలో నాయకానాయికలు చూడముచ్చటగా కనిపించారు’ అని అన్నారు హను రాఘవపూడి. ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతా రామం’. 1965 యుద్ధం నేపథ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 5న తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకానుంది. స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. ‘ఇంతందం దారి మళ్లిందా..భూమిపైకే చేరుకున్నాదా..లేకుంటే చెక్కి ఉంటారా..అచ్చు నీలా శిల్ప సంపద..జగత్తు చూడని మహత్తు నీదేలే..’ అంటూ చక్కటి ప్రణయ భావాలతో సాగిన ఈ పాటను కృష్ణకాంత్ రచించగా, విశాల్ చంద్రశేఖర్ బాణీలను సమకూర్చారు.
ఎస్పీ చరణ్ ఆలపించారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్‌చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని ప్రతి పాట మనసుకు హత్తుకునేలా ఉంటుంది. దర్శకుడు హను రాఘవపూడి అభిరుచిని ప్రతిబింబిస్తూ పాటలు బాగా కుదిరాయి’ అన్నారు. హృద్యమైన కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుందని కథానాయిక మృణాళ్ ఠాకూర్ చెప్పింది. రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్‌మీనన్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైన్: సునీల్‌బాబు, సమర్పణ: వైజయంతీ మూవీస్, దర్శకత్వం: హను రాఘవపూడి.