మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ సింగ్ కర్కి దర్శకుడు. హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మనోజ్ బాజ్పాయ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను లాయర్ పాత్రను పోషించా. ఎన్నో కష్టాలున్నప్పటికీ చిరునవ్వుతో వాటిని ఎదుర్కొనే వ్యక్తిగా నా పాత్ర అందరికి కనెక్ట్ అవుతున్నది.
సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించాం. ప్రజాస్వామ్య వ్యవస్థకు న్యాయ వ్యవస్థే మూల స్తంభంలాంటిది. అందుకే ఈ సినిమాకు ఆదరణ లభిస్తున్నది. తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. జీ స్టూడియోస్, భన్సాలి స్టూడియోస్ ఈ వెబ్ మూవీని నిర్మించాయి.