“సీతా రామం’ చిత్రంలో చిరకాలం నిలిచిపోయే రెండు శ్రావ్యమైన గీతాల్ని ఆలపించడం సంతోషంగా ఉంది. ఎన్ని పాటలొచ్చినా సంగీత ప్రియులు మెలోడీనే ఎక్కువగా గుర్తుంచుకుంటారు’ అని అన్నారు గాయకుడు ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సీతా రామం’ చిత్రంలో ఆయన రెండు పాటల్ని పాడారు. ఈ సినిమా ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ‘పాటలు విన్నవారు అచ్చం నాన్న బాలుగారి గాత్రంలాగే ఉందని అంటున్నారు.
25 ఏళ్ల కెరీర్లో వెయ్యి పాటలకు పైగా పాడాను. మొదటి నుంచి నా శైలిలోనే గీతాల్ని ఆలపించాను. ఇప్పుడు నాన్నగారు లేకపోవడం వల్ల పాటలు వినేవాళ్ల ధ్యాస నా మీదకు మళ్లిందేమో అనుకుంటున్నా. ‘సీతా రామం’ సినిమా కోసం గీత రచయిత కేకే చక్కటి సాహిత్యాన్నందించారు. మెలోడీకి తగిన సాహిత్యం కుదిరింది. ప్రస్తుతం తెలుగులో ఫాస్ట్‌బీట్ పాటల హవా తగ్గి చక్కటి మెలోడీలు వస్తున్నాయి. నా దృష్టిలో ఎక్కువ కాలం గుర్తుండిపోయేవి మెలోడీలే’ అన్నారు. తెలుగులో పాటలు పాడటం తగ్గించారెందుకనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తమిళంలో సినీ నిర్మాణంలో బిజీగా ఉండటం వల్ల తెలుగులో అవకాశాలు తగ్గాయనుకుంటున్నా. నేను మాత్రం ఒక్క ఫోన్ కాల్ దూరంలో సంగీత దర్శకులకు అందుబాటులో ఉంటా’ అని చెప్పారు.