ముంబై: అలనాటి గాయని శారదా రజన్ అయ్యంగార్ (86) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో ఇవాళ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. శారదా రజన్ అయ్యంగార్ 1965 నుంచి 1986 మధ్య ఎన్నో సినిమాలకు పాటలు పాడారు. 1966లో వచ్చిన సూరజ్ సినిమాలో పాడిన ‘తిత్లీ.. ఉడీ..’ పాట ద్వారా ఆమె బాగా ఫేమస్ అయ్యారు. ఆ పాటలో అభినయం వైజయంతీమాలది కాగా, శంకర్ జైకిషన్ సంగీతం అందించారు.
శారదా రజన్ అయ్యంగార్ను రాజ్ కపూర్ బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత శంకర్ జైకిషన్ ఆమెను బాగా ప్రోత్సహించారు. 1937లో జన్మించిన ఆమె పేరుకు తను పాడిన ‘తిత్లీ.. ఉడీ..’ పాట పర్యాయపదంగా మారిపోయింది. ఆమె తన కెరీర్లో ఎంతో మంది సంగీత దర్శకులు, నేపథ్య గాయనీ గాయకులతో కలిసి పనిచేశారు. వారిలో మహ్మద్ రఫీ, ఆశా భోస్లే, కిషోర్ కుమార్, యేసుదాస్, ముకేశ్, సుమన్ కళ్యాన్పూర్ ముఖ్యులు.
అలనాటి ప్రముఖ కథానాయికలు అందరికీ శారదా అయ్యంగార్ తన మధుర స్వరంతో పాటలు పాడారు. వారిలో వైజయంతీమాల, సాధన, సైరా బాను, హేమా మాలిని, శర్మిలా ఠాగోర్, ముంతాజ్, రేఖ, హెలిన్ తదితరులు ఉన్నారు.