Singer Kalpana Suicide | ప్రముఖ నేపథ్య గాయని సింగర్ కల్పనా రాఘవేందర్(Kalpana Raghavendar) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసం ఉంటున్న కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆమె ఇంటి తలుపులు తెరవకపోవడం.. తన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ప్రసాద్ అపార్ట్మెంట్ వాసులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా.. కల్పన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా.. ప్రాణపాయం నుంచి బయటపడడమే కాకుండా తాజాగా స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే కల్పన ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఆమె కూతురు కారణం అని తెలుస్తుంది. టాలీవుడ్ సినీ వర్గాల ప్రకారం.. నిన్న కేరళ నుంచి కల్పన హైదరాబాద్కి రాగా.. అనంతరం తన కూతురితో ఫోన్ మాట్లాడుతూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. తన కూతురిని హైదరాబాద్కి రమ్మని కోరగా.. ఆమె తిరస్కరించడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కల్పన సుసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మోతాదుకు మించి ట్యాబెట్లు వేసుకోవడంతో కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లగా… సాయంత్రం 5:00 గంటల సమయంలో ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేసినప్పుడు కల్పన స్పందించలేదు. దీంతో ఆయన విల్లా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విల్లా సెక్రటరీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన వెంటనే కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.