Simbu | కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. ఆయన నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయి మంచి విజయాలు సాధించడంతో టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇంతటి క్రేజ్ ఉన్నప్పటికీ శింబు ఇప్పటివరకు నేరుగా తెలుగు సినిమాలో నటించలేదు. దీంతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ గురించి తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని నెలలుగా శింబు ఓ ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థతో సినిమా చేయబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శింబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.
మనసనమహా’ షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు దీపక్ రెడ్డి చెప్పిన కథ నిర్మాతలను ఆకట్టుకుందని, శింబు కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆ తర్వాత ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇప్పుడు తాజాగా మరో కొత్త కథతో శింబు ముందుకు వచ్చినట్లు సమాచారం. యువ దర్శకుడు కీర్తిశ్వరన్ చెప్పిన కథ ఆయనను బాగా ఆకట్టుకుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘డ్యూడ్’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తిశ్వరన్, కొత్త తరహా కథాంశంతో శింబును మెప్పించినట్లు తెలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
ఇక శింబు కెరీర్ విషయానికి వస్తే, బాలనటుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2002లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రేమకథలు, యాక్షన్ డ్రామాలు, మాస్ ఎంటర్టైనర్లతో తమిళ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఒక దశలో తెలుగులో కూడా ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే వరుస పరాజయాలు, వ్యక్తిగత వివాదాల కారణంగా కొంతకాలం కెరీర్లో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తిరిగి వరుస విజయాలతో బలంగా కమ్‌బ్యాక్ ఇచ్చిన శింబు, ప్రస్తుతం తన కెరీర్‌ను కొత్త దిశగా తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు తమిళ హీరోలు నేరుగా తెలుగు సినిమాలు చేసి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో శింబు కూడా అదే బాటలో నడవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.