‘నిర్మాత రాజేందర్ మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని తెలుస్తున్నది. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. మంచి విజయాలను అందుకోవాలి. ‘సింబా’ సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్‌ది బెస్ట్. సినిమా ఈవెంట్‌కి వచ్చాం.. వెళ్లాం.. అని కాకుండా.. అందరూ మొక్కలు నాటండి. రాష్ర్టాన్ని పచ్చగా ఉంచండి.’ అని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. జగపతిబాబు, అనసూయ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’.
మురళీ మనోహర్ దర్శకుడు. సంపత్‌నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 9న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సంతోష్‌కుమార్ అతిథిగా విచ్చేసి మాట్లాడారు. నిర్మాతల్లో ఒకరైన సంపత్‌నంది మాట్లాడుతూ ‘ఈ సినిమా మొదలవ్వడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తను నన్ను ఛాలెంజ్ చేసింది.
ఆ తర్వాత సంతోష్‌గారు, కేసీఆర్‌గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. ఆ టైమ్‌లోనే ఈ కథ అనుకున్నా. అందరికీ కనువిప్పు కలిగేలా, వినోదాన్ని పంచేలా ఉండే సందేశాత్మక కథాంశమిది. నా సహ నిర్మాత రాజేంద్రరెడ్డికి ఈ కథతో పాటు మంచి కమర్షియల్ కథలు కూడా చెప్పా. కానీ ఆయన ఈ కథే ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలి, మనకి ఇంత ఇచ్చిన సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో నిర్మించిన సినిమా ఇది’ అని తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులతోపాటు తెలంగాణ శాసనసభ్యులు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ కూడా మాట్లాడారు.