Oye | మనుషులు కోతుల నుంచి వచ్చారు అంటే ఏమో అనుకుంటాం కానీ.. మనం చేసే పనులు చూస్తుంటే అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు రిలీజ్ అయిన సినిమాలను బాలేవు అంటూ ఫ్లాప్ చేస్తాము.. కానీ అవే సినిమాలు ఒక 15 సంవత్సరాల తర్వాత విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ పండగ చేసుకుంటాము. ఇప్పుడు ఇదే జరుగుతుంది. చాలా వరకు ఫ్లాప్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను మళ్లీ విడుదల చేస్తే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోయాయి. ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కుండా ఫుల్ పండగ చేసుకున్నారు ఆడియన్స్.
అదే 2009లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ రేంజ్లో రెస్పాన్స్ చూసి ఉంటే కచ్చితంగా సిద్ధార్థ్ ఖాతాలో ఒక బ్లాక్‌బస్టర్ ఉండేది. కానీ అప్పుడు సినిమా చూడలేదు.. ఏం బాలేదు.. స్లోగా ఉంది.. హీరోయిన్ చచ్చిపోతే ఏం బాగుంటుంది అంటూ చాలా కథలు చెప్పారు. అదే సినిమాను ఇప్పుడు ప్రేమికుల రోజు స్పెషల్ అంటూ ఒక ట్యాగ్‌లైన్ వేసి విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. అసలు ఈ సినిమాకు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూసి ఎగ్జిబిటర్లు కూడా షాక్ అయ్యారు. ఒరేయ్ ఈ రేంజ్లో పండగ చేసుకుంటున్నారు.. ఈ రెస్పాన్స్ ఏదో 15 సంవత్సరాల కింద ఇచ్చి ఉంటే కచ్చితంగా సిద్ధార్థకు గుర్తుండిపోయే విజయం అందుకునేవాడు కదరా బాబు అంటున్నారు.
ఆనంద్ రంగా తెరకెక్కించిన ఓయ్ సినిమాలో షామిలి హీరోయిన్గా నటించింది. ఇక ఓయ్ పరిస్థితి ఇలా ఉంటే.. లాస్ట్ ఇయర్ అచ్చంగా ఇలాంటి రెస్పాన్స్ ఆరెంజ్ సినిమాకు కూడా ఇచ్చారు ప్రేక్షకులు. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ 2010లో తెరకెక్కించాడు. అప్పుడు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇదే సినిమాను గత ఏడాది విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ ఓ రేంజ్లో పండగ చేసుకున్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ 3 ఇలా ఈ మధ్య చాలా ఫ్లాప్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తే అదుర్స్ అంటూ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే చంచల మనస్తత్వం అనేది కేవలం మనకు మాత్రమే ఉంటుంది అని మరోసారి నిరూపిస్తున్నారు మన ఆడియన్స్. ఇక ఇదే అదునుగా అకేషన్ చూసి ఫ్లాప్ సినిమాలను మళ్లీ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.