V. Shantaram Biopic | బాలీవుడ్ సినీ చరిత్రలో సుప్రసిద్ధ దర్శకుడు, నటుడు అయిన దిగ్గజ చలనచిత్ర నిర్మాత వి. శాంతారామ్ (V Shantaram) జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ యువ నటుడు సిద్దాంత్ చతుర్వేది టైటిల్ రోల్లో నటించనున్నారు. ఈ బయోగ్రాఫికల్ డ్రామాకు ‘వి. శాంతారామ్’ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రానికి అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వం వహించబోతుండగా.. రాహుల్ కిరణ్ శాంతారామ్, సుభాష్ కాలే మరియు సరిత అశ్విన్ వర్దే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వి. శాంతారామ్ యొక్క అద్భుతమైన సినీ ప్రయాణాన్ని చూపించనుంది. సైలెంట్ యుగం (మూకీ సినిమాల కాలం) నుంచి టాకీలు (శబ్దంతో కూడిన సినిమాలు) ఆపై కలర్ సినిమా యుగం వరకు ఆయన చేసిన కృషి, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఘనమైన ప్రస్థానాన్ని ఈ చిత్రం తెరకెక్కించనుంది.
శాంతారామ్ సినీ ప్రస్థానం
1901 నవంబర్ 18, 1901లో మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో జన్మించిన వి. శాంతారామ్ 1921లో నటుడిగా వెండితెరపై అడుగుపెట్టాడు. అనంతరం నటనతో పాటు మొత్తం 55కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ (1929), రాజ్‌కమల్ కళామందిర్ (1942) లాంటి సంస్థలు స్థాపించి 92 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించాడు. శాంతారామ్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం అతడిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (1985), పద్మవిభూషణ్ (1992 మరణానంతరం) లతో సత్కరించింది.