కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ బ్రతికున్న వారిని కూడా చంపేస్తున్నారు. రీసెంట్గా యువ నటుడు, బిగ్‌బాస్ విన్నర్ సిద్దార్థ్ శుక్లా హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. యుక్త వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
సిద్దార్థ్ మృతిపై హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం సిద్ధార్థ్ శుక్లా ఫొటోకి బదులు హీరో సిద్ధార్థ్ ఫొటోని షేర్ చేస్తూ ‘రిప్ సిద్ధార్థ్’ అని పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ విషయం సిద్దార్థ్ దృష్టికి రావడంతో ఆయన తన సోషల్ మీడియాలో స్పందించారు.
కావాలనే కొందరు ఇలా వేధిస్తున్నారని, ద్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంటూ తన గురించి షేర్ చేసిన తప్పుడు పోస్ట్ కూడా షేర్ చేశాడు. గతంలో కూడా సిద్ధార్థ్ మరణించాడంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. యంగ్ ఏజ్‌లో మరణించిన సౌత్ ఇండియాకు చెందిన 10 మంది తారలు అంటూ ఓ వీడియో అప్లోడ్ కాగా.. ఈ వీడియో థంబ్‌నైల్‌పై హీరోయిన్స్ ఆర్తి అగర్వాల్, సౌందర్య ఫొటోలతో పాటు హీరో సిద్దార్థ్ ఫొటో కూడా వేశారు.దీనిపై కూడా సిద్ధార్థ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు.