Shwetha Menon | మలయాళ సినీ నటి శ్వేతా మీనన్‌పై ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు ఐటీ చట్టంలోని సెక్షన్ 67Aతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆమె అనైతికంగా డబ్బు సంపాదించేందుకు అశ్లీల కంటెంట్ ఉన్న సినిమాలు, ప్రకటనల్లో నటించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది.ఈ కేసు “అమ్మ” (Malayalam Movie Artistes Association – AMMA) ఎన్నికల వేళ పెను చర్చకు దారితీసింది. ప్రస్తుతం శ్వేత మీనన్ ఈ సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సందర్భంలో ఈ కేసు సంచలనంగా మారింది. సోషల్ యాక్టివిస్ట్ మార్టిన్ మేనచేరి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఎర్నాకుళం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో పోలీసులు శ్వేతపై కేసు నమోదు చేశారు.
కేసులో ఐటీ చట్టం సెక్షన్ 67Aతో పాటు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ (PITA) సెక్షన్లు 3, 5 కూడా ఉన్నాయి. ఈ అభియోగాలన్నీ నాన్‌బెయిలబుల్‌గా నమోదు చేయబడినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మీనన్ ‘పలేరి మాణిక్యం’, ‘రతినిర్వేదం’, ‘కలిమన్ను’ వంటి చిత్రాల్లో నటించారని, వాటిలో శృంగార సన్నివేశాలు ఉన్నాయనీ, అలాగే కండోమ్ ప్రకటనల్లో నటించారని మార్టిన్ ఆరోపించారు. ఈ కంటెంట్ సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా విస్తృతంగా షేర్ అయ్యిందని, శ్వేత దీనివల్ల లాభాలు పొందినట్లు ఆరోపించారు. ఇది భారతీయ శిక్షాస్మృతి మరియు ఐటీ చట్టాల ఉల్లంఘన అని పిటిషన్లో పేర్కొన్నారు.
“అమ్మ” ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. శ్వేత మీనన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. మొదటగా ఆరుగురు నామినేషన్ దాఖలు చేసినా, నలుగురు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం పోటీలో శ్వేతతో పాటు మరో అభ్యర్థి నటుడు దేవన్ మాత్రమే ఉన్నారు. శ్వేత గెలిస్తే ఆమె “అమ్మ” తొలి మహిళా ప్రెసిడెంట్ అవుతారు. ఈ కేసు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా అనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత, అప్పటి అధ్యక్షుడు మోహన్ లాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త నాయకత్వం కోసం ఎన్నికలు జరుగుతున్న వేళ శ్వేతపై వచ్చిన ఈ కేసు కీలక మలుపుగా భావించబడుతోంది.