కమల్ ముద్దుల తనయ శ్రుతిహాసన్ ప్రస్తుతం అటు ఆనందానికీ ఇటు బాధకీ మధ్య కొట్టుమిట్టాడుతున్నది. దానికి కారణం తన పెంపుడు పిల్లి. దాని పేరు ‘కోరా’. కొన్ని రోజుల క్రితం ఆ పిల్లి తప్పిపోవడంతో.. ఆ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకొని బాధను వ్యక్తం చేసింది శ్రుతిహాసన్. రీసెంట్గా ఆ పిల్లి తనకు తారసపడిందట. ఈ విషయం గురించి తాజా పోస్ట్‌లో స్పందిస్తూ.. ‘ కోరా మళ్లీ కనిపించింది.
నిజంగా అది కనిపించగానే చెప్పలేనంత సంతోషం కలిగింది. అయితే.. బక్కచిక్కిపోయిన దాని స్థితిని చూస్తే బాధేసింది. ఇంటికి తీసుకెళ్లడానికి ట్రై చేశాను. కానీ తను రాలేదు. కోరాకు ఇంటికి రావడం ఇష్టం లేదు. తన ప్రపంచంలో తానుండాలని కోరా కోరుకుంటున్నది. తను కనిపించినందుకు ఆనందించాలో, ఇంటికి రావడానికి ఇష్టపడనందుకు బాధపడాలో అర్థం కావడంలేదు. ఏదేమైనా ఓ పెట్‌కి సంరక్షకురాలిగా ఉండటం నిజంగా సవాల్.’ అంటూ చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.