రెండు దశాబ్దాలుగా నట ప్రయాణం సాగిస్తున్నది అందాల తార శ్రియా సరన్. గతంలో స్టార్ హీరోల సరసన కమర్షియల్ చిత్రాల్లో ఆడిపాడిన ఆమె…ప్రస్తుతం కథా బలమున్న చిత్రాల్లో నటిస్తున్నది. శ్రియా ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. ఈ చిత్రాన్ని యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందించారు. ఈ నెల 12న ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది శ్రియా సరన్.
సంగీతాన్ని, సందేశంతో కలిపి రూపొందించిన చిత్రమిది. మన సినిమాల్లో పాటలు ఉండటం సహజం. కమర్షియల్ చిత్రాల్లో ఆరు పాటలు తెరకెక్కిస్తారు. ఆ కథల్లో పాటలు చాలా సార్లు కథకు అడ్డుగా మారుతుంటాయి. కానీ ఈ సినిమాలో పాటలు కథను ముందుకు తీసుకువెళ్తాయి. ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. ఆయన చేసిన స్వరాలు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. నాకు వ్యక్తిగతంగా డ్యాన్సులు ఇష్టమైనా ఈ చిత్రంలో మ్యూజిక్ టీచర్ పాత్రలో నటించడాన్ని ఆస్వాదించాను. ‘నేనున్నాను’ సినిమాలో మ్యూజిక్ స్టూడెంట్ పాత్రలో నటించాను గానీ మ్యూజిక్ టీచర్‌గా కనిపించడం ఇదే తొలిసారి. సంగీతం నేర్పించేందుకు గోవా నుంచి హైదరాబాద్ వస్తాను. ఇందులో ఒక పాట పాడేప్పుడు మాత్రం ఇబ్బంది పడ్డాను. పిల్లలకు స్ఫూర్తినిచ్చే డైలాగ్‌లా పాట సాగుతుంది.
సంగీతం నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపించరు. కనీసం 30 శాతం ఇష్టమున్నా సంగీతం, నృత్యాలు బాగా నేర్చుకోవచ్చు. మ్యూజిక్ క్లాస్‌లో సైన్స్, మ్యాథ్స్ హోమ్ వర్క్ చేస్తుంటారు. వాళ్లకే కాదు తల్లిదండ్రులకు కూడా పిల్లలకు పరీక్షల్లో 99 శాతం మార్కులు రావాలని కోరుకుంటారు. పిల్లల మీద ఒత్తిడి పెడుతుంటారు. సంగీతం, డ్యాన్స్, ఆటలు..ఇలాంటివి జీవితంలో మీరు ఎలా ఉండాలో నేర్పిస్తాయి. పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుతాయి. మానసికంగా మీలోని ఒత్తిడినంతా తీసేస్తాయి. అనుకున్నది జరగడం లేదనే నిరాశను మీ నుంచి పోగొడతాయి. కళలను నేర్పించడమే పిల్లలకు మనం ఇచ్చే పెద్ద బహుమతి అనుకోవచ్చు. నా వ్యక్తిగత అనుభవానికి వస్తే చిన్నప్పుడు నేను డ్యాన్సు నేర్చుకున్నాను. సంప్రదాయ నృత్యాల్లో నా ప్రతిభ తెలిశాక మా అమ్మా నాన్న నన్ను మరింతగా ప్రోత్సహించారు.
ఈ సినిమాలో తల్లిదండ్రులకు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాం. పిల్లల్లో తమదైన ఇష్టాలు ఉంటాయి. ఏ రంగంలో వారికి ఆసక్తి ఉందో తెలుసుకుని ప్రోత్సహించాలి. కోతిని ఈత కొట్టమంటే కొడుతుందా?, అలాగే చేపను చెట్టు ఎక్కమంటే ఎక్కుతుందా? ఎవరి బలాలు వారికి ఉంటాయి. అది తెలుసుకుని ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతాలు చేయగలరు. జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారు. ఇవన్నీ ఉన్నవి ఉన్నట్లు చెబితే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే దర్శకుడు పాపారావు ఈ అంశాలకు సంగీతం, వినోదాన్ని కలిపి ఒక కమర్షియల్ చిత్రంలా రూపొందించారు.
హైదరాబాద్‌లో మ్యూజిక్ యూనివర్సిటీ పెట్టాలని ఇళయరాజా గారికి కేటీఆర్ చేసిన సూచన చాలా బాగుంది. మన దగ్గర ఎంతో ప్రతిభ ఉంది. మంచి గురువులు ఉన్నారు. కానీ విద్యార్థులకు నేర్చుకునేందుకు సరైన వేదికలు లేవు. వారికి మంచి గురువుల దగ్గరకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు. మ్యూజిక్ యూనివర్సిటీ పెడితే ఔత్సాహిక విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. దాంతో పాటు కళారంగ ప్రదర్శనల కోసం ప్రత్యేకంగా థియేటర్స్ ఏర్పాటు చేయాలి.
పాండమిక్‌లో ప్రేక్షకులు దేశీయంగా అనేక ప్రాంతాలే కాక విదేశాల మూవీస్, వెబ్ సిరీస్ చూశారు. వాళ్లకు కంటెంట్ బాగుంటే భాష, ప్రాంతం ముఖ్యం కాదని తెలిసింది. అందుకే ఇవాళ కంటెంట్ బాగున్న సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అలాగని స్టార్స్ ప్రభావం పోయిందని కాదు. నేను రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ చూశాను. నా నట ప్రయాణంలో బాగా ఎంజాయ్ చేసి నటించిన చిత్రాలు ఆడని సందర్భాలు ఉన్నాయి, అలాగే ఊహించని విజయాలు దక్కిన రోజులున్నాయి. ఏం జరిగినా స్వీకరించాల్సిందే. ఇకపైనా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలనుకుంటున్నాను. ప్రతిభగల దర్శకులతో పనిచేయాలనే కోరిక ఉంది.
ఈ చిత్ర దర్శక నిర్మాత బియ్యాల పాపారావు ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. ఆయనకు సినిమాలు రూపొందించడం అంటే ఇష్టం. కనీసం ఐదారు స్క్రిప్ట్స్ రాసుకున్నారు. మొదటగా ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఎవరైనా, ఏ రంగంలో ఉన్నా తమకు నచ్చిన పనిచేసేందుకు కలగనవచ్చు. పాపారావు దర్శకుడిగా మారి తన కల నెరవేర్చుకున్నారు. అందుకోసం కష్టపడ్డారు. గమ్యం దిశగా అడుగులు వేసి అనుకున్నది సాధించారు.
ఈ సినిమాలో బాల నటీనటుల కోసం ఐదు నెలల పాటు ఆడిషన్స్ చేశా రు. పాత్రలకు సరైన పిల్లలను తీసుకున్నారు. మా చిత్రాన్ని దిల్ రాజు లాంటి అనుభవం గల నిర్మాత విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో చాలా మంది చిన్న పిల్లలు నటించారు. వారి నటనలో ఎంతో నిజాయితీ ఉంటుంది. ఆ సన్నివేశంలో తా ము నిజంగా ఉంటే ఎలా స్పందిస్తారో అలాగే నటించారు. కానీ సీన్ అయ్యాక వారి అల్లరి ఆపడం ఎవరి వల్లా కాలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను పక్కకు వెళ్లి కూర్చున్నా..దగ్గరకు వచ్చి ఏదో ఒకటి చెవిలో చెబుతుండేవారు. నేను విన్నట్లు నటిస్తు అవునా అనేదాన్ని. పిల్లలతో కలిసి నటించడం కష్టమే.