Shraddha Kapoor | ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కథానాయిక శ్రద్ధాకపూర్ పేరు మార్మోగిపోతున్నది. ఇటీవల విడుదలైన ‘స్త్రీ-2’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుందీ భామ. దాదాపు 400కోట్లకుపైగా వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్నది. ఇందులో శ్రద్ధాకపూర్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది శ్రద్ధాకపూర్. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల మొత్తం వసూళ్లు 1603 కోట్లను దాటాయి. దీంతో ఈ భామ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రాను అధిగమించింది.
బాలీవుడ్ హీరోయిన్స్ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ జాబితాలో 3195 కోట్లతో దీపికా పడుకోన్ అగ్రస్థానంలో ఉండగా కత్రినాకైఫ్, కరీనాకపూర్, అలియాభట్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ‘స్త్రీ-2’ వసూళ్లతో శ్రద్ధాకపూర్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంది.
మరో విశేషం ఏమిటంటే..ఇప్పటివరకు బాలీవుడ్ ఖాన్‌త్రయం అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ చిత్రాల్లో కథానాయికగా నటించకుండానే ఆమె ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. కథాంశాల ఎంపికలో వైవిధ్యం, ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా క్లీన్ ఇమేజ్ కలిగి ఉండటం శ్రద్ధాకపూర్‌కు సానుకూలాంశాలుగా మారాయని, భవిష్యత్తులో ఆమె బాలీవుడ్లో అగ్ర తారగా నిలవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.