Samantha | సమంత, రాజ్ నిడిమోరుల వివాహం ఇటీవలే డెస్టినేషన్ స్టైల్లో ఘనంగా జరగగా, ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఈ వేడుకలో జరిగిన ప్రత్యేక క్షణాలను పంచుకోగా, తాజాగా రాజ్ నిడిమోరుల పిన్ని శోభారాజు కూడా ఈ వివాహంపై ఎన్నో తెలియని విషయాలు వెల్లడించారు. అన్నమయ్య సంకీర్తనలతో ప్రసిద్ధి చెందిన ఆమె, సామ్‌తో ఉన్న మునుపటి అనుబంధాన్ని, రాజ్ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
“రాజ్ మా అక్క కుమారుడు. చిన్నప్పుడే డివోషనల్ పాటలు పాడేవాడు. అతనిపై నాకు అపారమైన ప్రేమ,” అని చెప్పిన శోభారాజు, సమంత గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. “ఆహారం విషయంలో సామ్ చాలా క్రమశిక్షణతో ఉంటుంది. మూడు నెలలకోసారి ఈశా యోగా కేంద్రానికి వెళ్లి ధ్యానం చేస్తుందని విన్నాను… తర్వాత నిజమే అని తెలిసింది. ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది. ఆమె ఇచ్చే డైట్ సలహాలు పాటించాలంటే భయమేసేది,” అని చిరునవ్వుతో గుర్తుచేసుకున్నారు. సామ్ ఆధ్యాత్మికత, ధ్యానం, ఫిట్నెస్ పట్ల ఉన్న నిబద్ధత రాజ్‌కు కూడా ఉందని, ఇద్దరూ ఆహారం, వ్యాయామం, మెడిటేషన్ విషయంలో ఒకే రకమైన క్రమశిక్షణ పాటించడం మంచి విషయం అని తెలిపారు.
ఈ పెళ్లిలో పాటించిన ప్రత్యేక ఆచారాల గురించీ శోభారాజు వివరించారు. వివాహ పద్ధతిలో ‘క్లేశ నాశన’ అనే ఆధ్యాత్మిక రిట్యువల్ను చేపట్టారని, పూర్తిగా సాత్వికాహారంతో అతిథులను ఆతిథ్యం పలికారని చెప్పారు. అలాగే అతిథులకు సహజ సిద్ధమైన పర్ఫ్యూమ్స్ను గిఫ్ట్‌గా ఇచ్చారని తెలిపారు.
“పెళ్లి దుస్తుల్లో సమంత అసాధారణంగా అందంగా కనిపించింది,” అని ఆమె పొగడ్తలు కురిపించారు.వివాహ వేడుకలు ముగియగానే మళ్లీ తమ తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్లతో బిజీ అయ్యారు సమంత, రాజ్. కాగా, సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సామ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇక రాజ్ నిడిమోరుల విషయానికి వస్తే, అతను తాజగా రూపొందించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ అమెజాన్ ప్రైమ్‌లో భారీ విజయాన్ని అందుకుంటోంది. ఇటీవల ముంబైలో జరిగిన సక్సెస్ పార్టీకి రాజ్, డీకే, మనోజ్ బాజ్‌పాయ్ తదితరులు హాజరయ్యారు.