Vijay Devarakonda | యూత్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో కీలక మలుపు చోటు చేసుకోనుంది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, తాజాగా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతూ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ‘కింగ్డమ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఇప్పుడు మరింత జాగ్రత్తగా కథల ఎంపికలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ‘రౌడీ జనార్దన్’ సినిమా ప్రత్యేకంగా నిలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్లో విభిన్నమైన ప్రయత్నంగా భావిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూపించిన మాస్ ఎలిమెంట్స్, గ్రామీణ వాతావరణం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచాయి.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాటు బలమైన టెక్నికల్ టీమ్ పనిచేస్తుండటం విశేషం. హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపిక కావడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. నటీనటుల ఎంపిక విషయంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఇక కథలో భావోద్వేగాలకు కీలకమైన పాత్రల కోసం అనుభవజ్ఞులైన నటులను తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.
సీనియర్ నటి శోభన ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారన్న వార్త సినిమాకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించే అవకాశాలున్నట్లు చర్చ నడుస్తోంది. భారీ తారాగణం, గ్రామీణ శైలిలో సాగే యాక్షన్ కథాంశం, పీరియాడిక్ టచ్ అన్నీ కలిసి ‘రౌడీ జనార్దన్’ను విజయ్ దేవరకొండకు మాస్ కమ్‌బ్యాక్ మూవీగా నిలబెడతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.