TTDClarification | ప్రముఖ యాంకర్ శివజ్యోతికి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక ప్రచారంపై తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన అధికారులు శివజ్యోతి ఆధార్ కార్డును బ్లాక్ చేశారని.. ఇకపై ఆమెను శ్రీవారి దర్శనానికి అనుమతించరని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లోఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. టీటీడీ చరిత్రలో ఏ ఒక్క భక్తుడిని లేదా భక్తురాలిని ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి రావొద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని ఈ ప్రచారం కేవలం నిరాధారమైనదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇతర మతాలకు చెందిన భక్తులు కూడా డిక్లరేషన్ (స్వామివారిపై విశ్వాసం) సమర్పించి శ్రీవారిని దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పిస్తుంది. అలాంటిది ఒక హిందూ భక్తురాలిని నిలిపివేసే అవకాశం లేదని స్పష్టమవుతోంది. శివజ్యోతి ఇటీవల శ్రీవారి ప్రసాదం గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. అయితే, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించిన వెంటనే ఆమె క్షమాపణ చెప్పింది. ఆమె కూడా శ్రీనివాసుడి భక్తురాలు కావడం, ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రోలింగ్ ఆపాలని పలువురు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఒక మహిళను, ముఖ్యంగా గర్భిణిని లక్ష్యంగా చేసుకుని వేధించడం, ట్రోలింగ్ చేయడం సరికాదని భక్తులు కోరుతున్నారు.