Shiva Squel | అక్కినేని నాగార్జున హీరోగా, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. కేవలం బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రమే కాకుండా, తెలుగు సినీ పరిశ్రమకు కొత్త దిశ చూపిన మూవీగా గుర్తింపు పొందింది. ఇప్పుడు ఆ లెజెండరీ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు 36 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, మేకర్స్ ‘శివ’ను నవంబర్ 14న 4K క్వాలిటీలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించింది.
తాజాగా నిర్వహించిన మీడియా మీట్లో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ సినిమా అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు ..“శివ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటే, నాగ చైతన్య లేదా అఖిల్‌లో ఎవరిని హీరోగా తీసుకుంటారు?” అని అడగగా , దానికి ఆర్జీవీ తనదైన స్టయిల్లో స్పందిస్తూ.. ఇద్దరు కాదు. శివ అనేది నాగార్జున కోసం చేసిన సినిమా. ఆ పాత్రలో మరోవారిని ఊహించుకోవడం అసాధ్యం అని చెప్పాడు. ఆయన సమాధానం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది.
అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వచ్చే సినిమాల ట్రెండ్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి సినిమాల్లో హీరో టెన్షన్ పడే సన్నివేశాలు తగ్గిపోయాయి. ఇంట్రడక్షన్ సీన్ లేదా సాంగ్‌తోనే అతను సూపర్ హీరోలా చూపిస్తారు. కానీ శివలో హీరో ఒక సాధారణ మనిషి. అందుకే ఆయన హీరోయిజం మరింత ఎలివేట్ అయింది. ప్రేక్షకులు మళ్లీ ఆ భావోద్వేగాన్ని అనుభవిస్తారు అని అన్నారు. ప్రేక్షకులు ఇప్పటికే ఈ రీ-రిలీజ్‌పై చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. నవంబర్ 14న 4K ఫార్మాట్లో థియేటర్లలో మళ్లీ వినిపించబోతున్న “ఏం జాలిగా…” బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, క్లాసిక్ యాక్షన్ సన్నివేశాలతో శివ మరోసారి ప్రేక్షకుల గుండెల్లో గర్జించనుంది.