Shiva Shakti Dutta | తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా కొద్ది సేపటి క్రితం కన్నుమూసారు. వయోభారం కారణంగా ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. శివ శక్తి దత్తా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రచనలకే కాకుండా ఆయనకు చిత్రలేఖనంలో కూడా అసాధారణ ప్రతిభ ఉంది. ఆ మధ్య శివ శక్తి దత్తా ప్రతిభను చూసిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మంత్ర ముగ్దుడయ్యారు. 92 ఏళ్ల వయసులోనూ శివ శక్తి దత్తా ఆర్ట్ అద్భుతంగా గీసారు. స్వయంగా గీసిన దేవుళ్ల చిత్రపటాలు, శివాజీ మహారాజ్ బొమ్మతో ఆయన నివాసం ఓ దేవాలయంలా కనిపిస్తోంది. ఈ దృశ్యాలను అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
శివ శక్తి దత్తా వయసును లెక్కచేయకుండా పాటలు రాసారు. చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రానికి ఆయన గీతాల రచన చేసినట్టు సమాచారం. దీనితో పాటు అందంగా, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే పెయింటింగ్స్ వేస్తూ తన కళా వైభవాన్ని కొనసాగిస్తున్నారు. ఇక తన కుమారుడికి ఆస్కార్ దక్కినప్పుడు శివ శక్తి దత్తా చాలా ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంతో ఉప్పొంగిపోయాడు.. కీరవాణి తనకు పంచప్రాణాలు అని శివశక్తి దత్తా చెప్పుకొచ్చాడు. మూడో ఏట నుంచే కీరవాణికి సంగీతం నేర్పించానని , చిన్నప్పటి నుంచి కీరవాణి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నానని ఓ సందర్భంలో తెలిపాడు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ తనకు నచ్చలేదని పేర్కొన్నాడు. అసలు అది ఒక పాటేనా? అందులో సంగీతం ఎక్కడ ఉంది? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కానీ విధి విచిత్రమైనదని.. ఇన్నాళ్లు కీరవాణి పడ్డ కష్టానికి ఆస్కార్ రూపంలో ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే శివ శక్తి దత్తా మృతికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.