కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తన తాజా చిత్రం ‘భైరతి రంగల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివరాజ్‌కుమార్ మాట్లాడారు. ‘మనిషి అన్న తర్వాత శారీరక సమస్యలు సహజం. నేను ఆనారోగ్యంతో బాధపడుతున్న మాట నిజం. నా ఆరోగ్య సమస్య గురించి తొలిసారి తెలిసినప్పుడు భయపడిపోయా. నేను భయపడి, అభిమానుల్ని కలవరపెట్టడం నాకిష్టంలేదు.
అందుకే గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా. ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్మెంట్ పూర్తయింది. అభిమానులు ఆందోళన చెందవద్దు. నేను బాగున్నాను. ఇప్పుడంతా బాగానే ఉంది. నేను అబద్ధం చెప్పను.’ అన్నారు శివరాజ్‌కుమార్. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నా సమస్య నా నిర్మాతలకూ తెలుసు. అందుకే.. వారూ సహకరిస్తున్నారు. నేను కూడా ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తున్నాను. విడుదలకు సిద్ధమైన సినిమాల ప్రచార కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్నా. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి, త్వరలోనే శస్త్రచికిత్స నిమిత్తం అమెరికా వెళ్తున్నా. ఆ తర్వాత నెలరోజులు పూర్తి విశ్రాంతి. రాబోయే రెండుమూడు నెలల్లో అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నా’ అని తెలిపారు శివరాజ్‌కుమార్.