సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్ ఇండియా చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మానవుడికి, దైవానికి మధ్య జరిగే సంఘర్షణ ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శోభ అనే పాత్రలో సీనియర్ నటి శిల్పా శిరోద్కర్ నటిస్తున్నది.
గురువారం ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె హోమగుండం ముందు కూర్చొని ఉగ్రరూపంలో కనిపిస్తున్నది. ఆమె ప్రజెన్స్ తాంత్రిక శక్తులకు ప్రతీకలా ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్ హంగులతో మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, శిల్పా శిరోద్కర్ పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జీ స్టూడియోస్, ఎస్కేగీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఉమేష్‌కుమార్ బన్స్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగాల్, నిఖిల్ నందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.