Shhyamali De | బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డిసెంబర్ 1న నటి సమంతతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఈ వివాహం ముగిసిన మూడు రోజులకే రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీ దే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ సుదీర్ఘమైన భావోద్వేగ నోటు షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, భావోద్వేగ క్షోభ గురించి శ్యామాలీ బహిరంగంగా వెల్లడించింది.
కష్ట సమయాల్లో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను… తిరుగుతూ, వాదించుకుంటూ గడిచిపోయిన రోజులు ఉన్నాయి. నాపై ప్రేమ, మద్దతు చూపిస్తున్న వారికి స్పందించకపోవడం కృతజ్ఞత లేకపోవడమే అవుతుంది. దానికి క్షమాపణ కోరుతున్నాను అని ఆమె తన నోట్లో పేర్కొంది. ట్విన్ హార్ట్ ధ్యానం ద్వారా శాంతి, ప్రేమను వ్యక్తులకు చేరవేయడం నేర్చుకున్నానని, అదే తనను నిలబెట్టిందని శ్యామాలీ తెలిపింది. రాజ్ రెండో వివాహం విషయంలో కొందరి కామెంట్స్ పై స్పందించిన శ్యామాలీ ..నా దగ్గర , పీఆర్ టీం లేదు. నా సోషల్ మీడియాను నిర్వహించేవారు కూడా లేరు.
నా జీవితంలో చోటుచేసుకుంటున్న మార్పులకు నేను వ్యక్తిగతంగానే స్పందిస్తున్నాను. ఈ పోస్ట్‌ను సానుభూతి కోసం కాకుండా, నా హృదయంలోని భావాలను పంచుకోవడానికే షేర్ చేస్తున్నాను . నవంబర్ 9న తన జ్యోతిష్య గురువుకు స్టేజ్ 4 క్యాన్సర్ నిర్ధారించబడిందని, అది మెదడుతో పాటు అనేక అవయవాలకు వ్యాపించినట్లు బయటపడ్డదని శ్యామాలీ తెలిపింది. ప్రస్తుతం నా దృష్టి ఎక్కడ ఉందో మీరు అర్థం చేసుకోగలరు అంటూ ఆమె పేర్కొంది. శ్యామాలీ దే షేర్ చేసిన ఈ నోట్ వైరల్ అవుతుండగా, ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మాజీ భర్త రెండో పెళ్లిపై తన భావాలను ఎంతో ధైర్యంగా, నిజాయితీగా పంచుకున్నందుకు ప్రశంసలు లభిస్తున్నాయి.