సినిమా పేరు: కుబేర
తారాగణం: అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్భ్..
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
నిర్మాతలు: సునీల్ నారంగ్, రామ్మోహన్రావు పుస్కూర్
ధనుష్ హీరోగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’.. అనే ప్రకటన వచ్చిన నాటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి విభిన్నంగా ఆలోచించి రాసుకున్న కథ ఇదని, ప్రచార చిత్రాలు చెప్పకనే చెప్పాయి. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు సహజం. కానీ ప్రచార చిత్రాలు ఆ అంచనాలను పదింతలు చేశాయి. మరి అందరి అంచనాలనూ ‘కుబేర’ అందుకున్నాడా? శేఖర్ కమ్ముల చేసిన ఈ కొత్త ప్రయత్నం సఫలమైందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ:
సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త నీరజ్(జిమ్ సర్ఫ్) కన్ను పడుతుంది. ప్రభుత్వాన్ని కొని అయినా సరే.. ఆ అయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలని ప్రయాత్నాలు మొదలుపెడతాడు నీరజ్. ప్రభుత్వ పెద్దలను లక్ష కోట్లు ఎర వేయడంతో.. వాళ్లు నీరజ్‌కు సముద్రాన్ని రాసిస్తారు. ఆ లక్షకోట్ల నల్ల ధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు అది వైట్ మనీగా మారాలి. అలా మార్చగల ఒకేఒక్క వ్యక్తి సీబీఐ ఆఫీసర్ దీపక్(అక్కినేని నాగార్జున). కొందరి కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దీపక్‌ను ఈ విషయంలో సాయం కోరతాడు నీరజ్. జైలు నుంచి విడిపించడమే కాక, కావాల్సినంత డబ్బు కూడా ఇస్తామనడంతో.. స్వతహాగా నిజాయితీ పరుడైన దీపక్.. కుటుంబం కోసం నీరజ్‌తో తప్పక చేయి కలుపుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నాలుగు బినామీ ఖాతాలలో లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు. దాని కోసం నలుగురు బెగ్గర్లను సెలక్ట్ చేస్తారు. వారిలో దేవ(ధనుష్) ఒకడు. మరి దీపక్ ప్లాన్ వర్కవుట్ అయిందా? అసలు ఈ కథలో దేవా పాత్ర ఏంటి? దేవాకూ, దీపక్కూ మధ్య సంబంధం ఏంటి? పారిశ్రామిక వేత్త నీరజ్ ప్రయత్నం సఫలమైందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
కుంభకోణాలు, స్కామ్‌ల నేపథ్యంలో కథలు చాలా వచ్చినా.. కథలో బెగ్గర్లను ఇన్వాల్వ్ చేయడం మాత్రం నిజంగా కొత్త ప్రయత్నమే. జీవితంలో ఎలాంటి లక్ష్యాలూ లేని ఓ బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకొని జైలు పాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి. వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిగా బతికే ఓ అవినీతిపరుడు. ఈ ముగ్గురు మధ్య నడిచే డ్రామాని దర్శకుడు శేఖర్ కమ్ముల ఆసక్తిగా నడిపించాడు. తన మార్క్ కథనంలో ఈ సినిమాకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాడు. నిజానికి ఇది శేఖర్ కమ్ముల జానర్ కాదు. ఇలాంటి ప్రయత్నం ఆయనకు ఇదే ప్రథమం. అయినా.. ఆకట్టుకునేలా తీశారు. కాకపోతే.. ఈ సినిమాకు నిడివి ఇబ్బందికరంగా మారింది. దానికితోడు సినిమా నడక కూడా స్లోగా సాగడంతో ఒక దశలో ఆడియన్స్ కాస్తంత ఇబ్బందిపడ్డారనే చెప్పాలి. మొత్తంగా ఓ బిలియనీర్ల ప్రపంచాన్నీ, గుడిమెట్ల దగ్గర భిక్షాటనం చేసి బతికే యాచకుల ప్రపంచాన్నీ, ప్రేమకోసం అయినవారిని వదిలుకొని, చివరకు మోసపోయి, బ్రతుకుదెరువుకోసం వెతుక్కుంటున్న ఓ మధ్య తరగతి అమ్మాయి ప్రపంచాన్నీ.. ఒకే స్క్రీన్‌పై చూపించడం.. వారి వ్యక్తిత్వాలను ఆవిష్కరించడం నిజంగా సాహసమే. పెట్టుబడి దారుల కబందహస్తాల్లో దేశం నలిగిపోతున్నదని, సామాన్యుల జీవితాలు ఈ కారణంగా చితికిపోతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల.
ఎవరెవరు ఎలా చేశారు?
ఈ కథలో ముందు నాగార్జున గురించి చెప్పుకోవాలి. ఆయన పోషించిన దీపక్ పాత్రలో ఎన్నో సంఘర్షణలున్నాయి. కుటుంబం కోసం నిజాయితీని వదులుకొని, తప్పు చేస్తున్నానన్న పాపభీతితో నలిగిపోయే పాత్ర ఆయనది. నిజంగా తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు నాగార్జున. ఈ మధ్యకాలంలో ఆయన దొరికిన మంచి పాత్ర ఇది. ఇక ధనుష్.. బిచ్చగాడుగా ఒదిగిపోయాడు. ఆ పాత్రలోని అమాయకత్వం, మూర్ఖత్వం అన్నీ అద్భుతంగా పండించాడు. ఈ కథలో రష్మిక పోషించిన సమీరా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఉన్నంతలో చాలా గొప్పగా నటించింది రష్మిక. ఓ వైపు తన సమస్యలతో బాధపడుతూ, మంచితనంతో కొత్త సమస్యలను తెచ్చుకునే పాత్ర ఆమెది. తను మంచి నటి అని మరోసారి రుజువు చేసింది కుబేర చిత్రం. జిమ్ సర్భ్ ైస్టెలిష్ విలనిజంతో ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా..
శేఖర్ కమ్ముల స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడితే బావుండేది అనిపించింది. సినిమా స్లోగా, లెన్తీగా ఉండటం కాస్త మైనస్. ఇక దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. చాలా సన్నివేశాల్ని ఆయన ఆర్.ఆర్. నిలబెట్టింది. నికేత్ బొమ్మిశెట్టి కెమెరా పర్లేదనిపించింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్థ తీసుకుంటే బావుండేది. మొత్తంగా ‘కుబేర’ ఓ కొత్త ప్రయత్నం. వైవిధ్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘కుబేర’ నచ్చొచ్చు.
బలాలు
కథ, నటీనటుల నటన, నేపథ్య సంగీతం..
బలహీనతలు
కథనం, ఎడిటింగ్..
రేటింగ్: 3/5