సంక్రాంతికి ఇంటిల్లిపాదిని అలరించే సినిమాగా ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు అగ్ర నిర్మాత అనిల్ సుంకర. శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత అనిల్ సుంకర విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రమిదని, రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని చెప్పారు. సంక్రాంతి సీజన్లో నాలుగైదు చిత్రాలు రావడం సాధారణమేనని, వాటిలో అన్ని సినిమాలు ఆడిన సందర్భాలున్నాయని ఆయన గుర్తుచేశారు. “సామజవరగమన’ టైంలోనే దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఈ సినిమా ఓకే చేశాం. ఈ సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మూవీలా తీర్చిదిద్దారు. సంక్రాంతి పోటీ గురించి అస్సలు ఆలోచించడం లేదు. కంటెంట్ బాగుంటే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.
ఈ సినిమాలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపిస్తారు. ఆయన కనిపించే సీన్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని అనిల్ సుంకర పేర్కొన్నారు. తాము ఎక్కువగా మహేష్‌బాబుతో సినిమాలు చేశామని, ప్రస్తుతం చిన్న చిత్రాలను కూడా తీస్తున్నామని చెప్పారు. సినిమా మేకింగ్ విషయంలో బౌండెడ్ స్క్రిప్ట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని, స్క్రిప్ట్ ప్రకారం సినిమా వచ్చిందంటే ఫలితం సానుకూలంగా ఉంటుందన్నారు. థియేటర్ల ప్రదర్శన కోసమే సినిమాలు తీయాలన్నది నిర్మాతగా తన అభిమతమని ఆయన తెలిపారు. తదుపరి సినిమా వివరాలు చెబుతూ ‘సాయిధరమ్‌తేజ్, తేజ సజ్జాతో సినిమాలు చేయబోతున్నాం. అడివి శేష్‌తో ‘గూఢచారి-2’ రాబోతున్నది. భవిష్యత్తులో ఎక్కువగా వినోదాత్మక చిత్రాల్నే చేయాలనుకుంటున్నాం. త్వరలో ‘ఎయిర్‌ఫోర్స్ బెజవాడ బ్యాచ్’ పేరుతో ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమా చేయబోతున్నాం’ అన్నారు.