OTT | టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గతంలో సామజవరగమన వంటి సూపర్ హిట్ హిలేరియస్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, శర్వానంద్ సరసన సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల చిత్రాలు ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కంటెంట్ బలం మీద మంచి రెస్పాన్స్ దక్కించుకొని భారీ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం సుమారు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్‌లోని నటన ప్రేక్షకులను ఆకట్టుకోగా, వీకే నరేష్ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకుని రూపొందించిన ఈ మూవీ థియేటర్లలో నవ్వుల పండుగలా మారింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి కూడా అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుని, ఫిబ్రవరి 4 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ ప్రారంభించింది.
ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. విశేషం ఏమిటంటే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్, మదునందన్, సంపత్ రాజ్, రఘుబాబు, సుదర్శన్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అదనంగా యంగ్ హీరో శ్రీ విష్ణు స్పెషల్ క్యామియోలో కనిపించడం అభిమానులకు సర్ప్రైజ్గా మారింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. థియేటర్లలో ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను మిస్ అయినవారికి ఇప్పుడు మంచి అవకాశం లభించింది.