‘టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే ఇంటర్ కాలేజీ రోజుల్లోకి వెళ్లిపోతా. అవన్నీ హ్యాపీడేస్. నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఆందోళన ఏమీ ఉండేవి కావు. అప్పుడప్పుడు కాలేజీ డుమ్మా కొట్టి సినిమాకెళ్లడం..అక్కడి నుంచి దాబాకి వెళ్లి ఫుడ్ తినడం గొప్పగా అనిపించేది. జీవితంలో నిజంగా అవి గోల్డెన్ డేస్’ అని అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఒకే ఒక జీవితం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం శర్వానంద్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివి..
ఈ సినిమాలోని ఎమోషన్స్ అందరికి కనెక్ట్ అవుతున్నాయి. ఈ విజయంతో ఓ బరువు దిగిపోయిందనే భావన కలిగింది. ఇటీవలే పిల్లల కోసం స్పెషల్ షో వేశాం. వాళ్లు చాలా ఎంజాయ్ చేశారు. టైం ట్రావెల్లో ఎక్కడకు వెళ్తారని అడిగితే ప్రజెంట్‌లోనే ఉండి ఎంజాయ్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వాళ్లంతా ముదుర్లు (నవ్వుతూ). వెనకటి తరంలా కాకుండా జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు.
వీకెండ్స్‌లో థియేటర్స్ ఫుల్
సినిమా వసూళ్ల గురించి నేను పెద్దగా ఆలోచించను. జయాపజయాల్ని సమంగా స్వీకరిస్తాను. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తా. ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు నెమ్మదిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. రెండో వారంలో కూడా అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తున్నది. వీకెండ్స్‌లో థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. మరో మూడు వారాల వరకు వసూళ్లు నిలకడగా ఉంటాయని భావిస్తున్నా. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అమలగారు నన్ను తన మూడో కుమారుడిగా భావిస్తానని చెప్పడం ఆమె సహృదయతకు నిదర్శనం. అఖిల్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా తర్వాత నాగార్జునగారితో కూడా మంచి అనుబంధం ఏర్పడింది. అమలగారు నిజంగా నన్ను తన మూడో కొడుకులాగానే భావిస్తారు. ఆ విషయంలో నేను లక్కీ అనుకుంటున్నా.
పధ్నాలుగు కిలోలు తగ్గాను
సినిమా అంటేనే మనం కాని దానిని తెరపై చూపించాలి. అందుకే ఏ జోనర్ కంఫర్ట్ అని చెప్పను. కామెడీ రోల్స్ చేయడాన్ని మాత్రం ఎంజాయ్ చేస్తా. ఇక సక్సెస్ఫెయిల్యూర్స్కు గురించి నేను చాలా ఓపెన్‌గా మాట్లాడతా. ఓ చెడ్డ సినిమా చేసి దాన్ని హిట్ అని చెప్పుకోవడం ప్రేక్షకుల్ని మోసం చేయడమే అవుతుంది. ఏది ఎలాంటి సినిమానో ప్రేక్షకులు సులభంగా తెలుసుకుంటారు. ఫలితాన్ని నిజాయితీగా ఒప్పుకోవడమే భవిష్యత్తులో మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో పధ్నాలుగు కిలోల బరువు తగ్గాను. అందులో సీక్రెట్ ఏమీ లేదు. రైస్ తక్కువగా తీసుకుంటున్నా. ప్రస్తుతం కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ పొలిటికల్ డ్రామాలో నటిస్తున్నా. మరో మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి.