Sharwanand | టాలీవుడ్లో కొత్త కాంబినేషన్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కలయికలో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, తాజాగా హీరోయిన్ ఎంపికకు సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘జార్జ్ క్రిష్’ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం పలువురు నటీమణుల పేర్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం యువ నటి భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.అయితే చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే హీరోయిన్ ఎంపికపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తొలి షెడ్యూల్లో ముఖ్యమైన ప్రారంభ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత జరగనున్న రెండో షెడ్యూల్లో హీరో-హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లొకేషన్లు, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ద్వారా సినిమాకు మంచి వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.
అయితే షూటింగ్ షెడ్యూల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తైతేనే ఈ విడుదల సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీను వైట్ల గత కొన్ని సంవత్సరాలుగా ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. ఇటీవల గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. దీంతో మళ్లీ తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్‌కు కథ వినిపించిన వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.తెలియని వయసులో ఆవేశంతో హీరో తీసుకున్న ఒక నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మార్చింది? ఆ సంఘటన తర్వాత అతని జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా అంశాలతో పాటు శ్రీను వైట్ల శైలిలో వినోదానికి కూడా ప్రాధాన్యం ఉంటుందని టాక్ వినిపిస్తోంది.