Sharukh Khan | బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ని ఆయన అభిమానులు ప్రేమగా “కింగ్ ఖాన్” అని పిలుస్తారు. కొంతమంది దర్శకులు కథకు తగిన నటులను వెతుకుతుంటే, మరికొంతమంది ఓ నటుడిని ఊహించుకొని కథ రాస్తారు. ఈ రెండింటికి సరిపడే నటుడు ఎవరో అంటే, షారుఖ్ ఖాన్ అనే చెప్పాలి. 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో జన్మించిన షారుఖ్ తన కెరీర్‌ను 1980లలో టీవీ సీరియల్స్‌తో ప్రారంభించారు. 1992లో ‘దీవానా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, వెంటనే ‘బాజీగర్’, ‘డర్’ వంటి సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. కానీ 1995లో వచ్చిన ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రం మాత్రం ఆయన కెరీర్‌కు మలుపుతిరిగింది. అప్పటి నుంచి అమ్మాయిల కలల రాకుమారుడిగా, రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.
షారూఖ్ తన కెరియర్లో ‘స్వదేశ్’, ‘చక్‌దే ఇండియా’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’, ‘దేవదాస్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. నటనలో ప్రేమ, ఆగ్రహం, ఆత్మవిశ్వాసం, బాధ.. అన్నీ ఆవిష్కరించగలిగే నటుడిగా పేరు పొందారు. నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు.ఓ సందర్భంలో షారూఖ్ మాట్లాడుతూ.. నేను చనిపోయే వరకు సినిమాల్లోనే ఉంటాను. ఏదైనా సెట్లో యాక్షన్ అనగానే మరణించాలి. వాళ్లు కట్ అనకముందే నా జీవితం ముగిసిపోవాలి. అదే నా చివరి కోరిక అని అన్నారు. ఈ మాటలే ఆయన సినిమాల మీద ఉన్న అసాధారణమైన ప్రేమను ప్రతిబింబిస్తాయి.
ఈ ప్రేమే ఆయన్ని బాలీవుడ్లో అగ్రహీరోగా నిలబెట్టింది. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా కూడా షారుఖ్ పేరు పొందారు. ఇప్పటి వరకు ఆయన 100కి పైగా సినిమాల్లో నటించి, 14 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ సహా ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో, షారుఖ్ ఖాన్ తన కలను నెరవేర్చుకున్నారు. ‘జవాన్’ సినిమాలో చేసిన అద్భుతమైన ద్విపాత్రాభినయంకి గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును షారుఖ్ ఖాన్, ‘ట్వెల్త్ ఫెయిల్’ హీరో విక్రాంత్ మాస్సేతో సంయుక్తంగా పంచుకుంటున్నారు. అయితే తనని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు షారూఖ్ ఖాన్ భారత సర్కారుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇటీవల షూటింగ్లో గాయపడ్డ షారూఖ్ షారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ నుండే వీడియో విడుదల చేయగా, అందులో తనతో పని చేసిన టీమ్ అందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రత్యేకంగా జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ పేరుని మెన్షన్ చేశాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీ తనని చిన్న పిల్లాడిలా చూసుకుంటుందని వారి కూడా థ్యాంక్స్ అని అన్నాడు. ఇక అభిమానుల అందరికి హగ్స్ అంటూ ప్రేమ కురిపించాడు. ఈ అవార్డ్ నేను భవిష్యత్‌లో చేయబోయే సినిమాల విషయంలో మరింత బాధ్యత పెంచిందని అన్నారు షారూఖ్.