 
                                                            Sharukh Khan |బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకలకి సమయం ఆసన్నమైంది. నవంబర్ 2న తన షష్ఠిపూర్తిని జరుపుకోనున్న ఆయన ఈసారి అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ముంబైలోని తన నివాసం ‘మన్నత్’ ముందు అభిమానులను పలకరించే షారుఖ్ ఖాన్, ఈసారి మాత్రం అక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోరు. కారణం ప్రస్తుతం మన్నత్ భవనంలో రిపేర్ మరియు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. అందువల్ల ఈసారి పుట్టినరోజు వేడుకలు అలీబాగ్‌లోని ఆయన ఫార్మ్‌హౌస్‌లో జరుగనున్నాయి.
ఈ వేడుకకు బాలీవుడ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు, అలాగే కొంతమంది సౌత్ సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. నవంబర్ 1 నాటికి అతిథులు అలీబాగ్ చేరుకుంటారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో పాటు అంబానీ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. టాలీవుడ్ నుండి చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు పలువురు ప్రముఖులకి కూడా ఆహ్వానం అందించనట్టు సమాచారం. ఇక షష్ఠిపూర్తి సందర్భంగా అభిమానులకు షారుఖ్ ఖాన్ ప్రత్యేక గిఫ్ట్ సిద్ధం చేశారు. ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్’ ఫస్ట్ లుక్ నవంబర్ 2న విడుదల కానుంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, దీపికా పదుకొనే, సుహానా ఖాన్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, జైదీప్ అహ్లవత్, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 2026లో గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుందని సినీ వర్గాల సమాచారం. ఈసారి షారుఖ్ పుట్టినరోజు వేడుకలు కేవలం బాలీవుడ్‌కే కాదు, సౌత్ సినీ ఇండస్ట్రీకి కూడా ప్రత్యేకంగా మారబోతున్నాయి. కొన్నాళ్లుగా షారూఖ్ నుండి బ్లాక్ బస్టర్స్ రావడం లేదు. మరి ఈ సారి బడా హిట్‌తో ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తాడా అనేది చూడాలి.
 
                            