ఒకప్పుడు ఆ కుటుంబం ఓ రాజ్యాన్నే పాలించింది. ఆ తర్వాత క్రికెట్‌ను, బాలీవుడ్‌నూ శాసించింది. వారుండే ఇంటి విలువ.. రూ.800 కోట్లకు పైమాటే! అంత డబ్బు ఉన్నా.. ఇల్లంతా పొదుపు మంత్రం పాటించాల్సిందే! డబ్బును ఆదా చెయ్యాల్సిందే! వినడానికి విచిత్రంగా ఉన్నా.. పటౌడీలు చెబుతున్న పొదుపు పాఠాలివి!
ఒకవైపు భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటీమణుల్లో ఒకరైన షర్మిల ఠాగూర్. మరోవైపు భోపాల్ నవాబు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్.
వీరి కొడుకు బాలీవుడ్ స్టార్హీరో సైఫ్ అలీఖాన్, కోడలు స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కూతురు బీటౌన్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సోహా అలీఖాన్. ఇంతమంది ఉద్దండుల నివాసం.. రూ.800 కోట్ల విలువ కలిగిన పటౌడీ ప్యాలెస్! వేల కోట్ల ఆస్తి ఉన్నా.. పటౌడీలు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సోహా అలీఖాన్ ఈ విషయాలను వెల్లడించారు. పటౌడీ ప్యాలెస్‌కు రంగులు వేయించకుండా.. కేవలం వైట్ వాష్ మాత్రమే వేయిస్తూ ఖర్చును ఆదా చేస్తుంటారట. ఇక షర్మిల ఠాగూర్.. ఎన్ని పనులున్నా ఇంటి ఖర్చులను దగ్గరుండి చూసుకుంటారట.
పద్దు లెక్కల పుస్తకాన్ని ఎప్పుడూ చేతిలో పట్టుకొనే ఉంటారట. అంతేకాదు.. తమ ఇంట్లోకి కొత్త వస్తువులు కొనికూడా కొన్నేళ్లు అవుతున్నదని చెప్పుకొచ్చింది సోహా! విచిత్రం ఏమిటంటే.. ఈ పొదుపు మంత్రం తమ తాతల కాలం నుంచీ ఉండేదట. ఈ ప్యాలెస్ నిర్మాణంలో పాలరాయి ఖర్చును తగ్గించడానికి కార్పెట్లను కొనుగోలు చేశారట. అందుకే.. ఇప్పుడు ప్యాలెస్ అడుగడుగునా కార్పెట్లే స్వాగతం పలుకుతాయని చెబుతున్నదని సోహా అలీఖాన్!