Shanmukh Jaswanth | సోషల్ మీడియా వేదికగా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్ జస్వంత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కరోనా తర్వాత జరిగిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని ఆయన ఫాలోయింగ్ మరింతగా పెంచుకున్నాడు. అదే సమయంలో వ్యక్తిగత జీవితం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందు దీప్తి సునైనా తో ప్రేమలో ఉన్న షణ్ముఖ్.. ఇద్దరూ బహిరంగంగానే తమ రిలేషన్‌షిప్‌ను వెల్లడించారు. అయితే షో సమయంలో షణ్ముఖ్ – సిరి హన్మంత్ మధ్య సాన్నిహిత్యం పెరగడంతో దీప్తితో బ్రేకప్ జరిగిందనే వార్తలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అనంతరం వీరిరివురు విడిపోవడాన్ని అధికారికంగానే ప్రకటించారు.
బిగ్‌బాస్ తర్వాత షణ్ముఖ్ మళ్లీ వెబ్ సిరీస్‌లు, సినిమాలపై దృష్టి పెట్టగా.. మధ్యలో యాక్సిడెంట్, డ్రగ్స్ ఆరోపణల వంటి వివాదాలతో కూడా వార్తల్లో నిలిచాడు. అయితే ప్రస్తుతం ఆయన మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా షణ్ముఖ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. ముఖం కనిపించకుండా ఓ యువతితో దిగిన పలు ఫోటోలను షేర్ చేస్తూ .. “Happy Birthday V… This is God’s plan” అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆ అమ్మాయి పేరు ‘V’ అక్షరంతో ప్రారంభమవుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ఆమె ఎవరో మాత్రం వెల్లడించలేదు.
ఈ పోస్ట్‌తో షణ్ముఖ్‌కు కొత్త ప్రేమ మొదలైందా? ఆ యువతి ఎవరు? ఎలా పరిచయం అయ్యారు? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీప్తి సునైనా నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయ్యి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై షణ్ముఖ్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. తన కొత్త ప్రేయసిని ఎప్పుడు అధికారికంగా పరిచయం చేస్తాడో చూడాల్సిందే.