ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ ఫ్యాక్టర్‌కు ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ ప్రతిభతో పాటు అదృష్టమూ కలిసి రావాలంటారు. ఇది నాయికల విషయంలో బాగా వర్తిస్తుంది. ప్రతిష్టాత్మక చిత్రాలతో అరంగేట్రం చేసిన హీరోయిన్లు కూడా ఆ తర్వాత అవకాశాలు లేక కనిపించకుండా పోయిన సందర్భాలెన్నో. బాలీవుడ్లో ఇలా చెప్పుకునే తార షమితా శెట్టి. నాయిక శిల్పా శెట్టి సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షమితా…తొలి అవకాశమే యష్ రాజ్ ఫిలింస్‌లో అమితాబ్, షారుక్, ఐశ్వర్య లాంటి తారలతో కలిసి ‘మెహబ్బత్తే’ చిత్రంలో అందుకుంది. ఆ సినిమాతో మంచి పేరు, పురస్కారాలు గెల్చుకుంది. ఇక అక్కడి నుంచే ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి.
ఈ విషయం మీద షమితా తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ…‘యష్ రాజ్ ఫిలింస్ లాంటి పెద్ద సంస్థలో అరంగేట్రం చేశాక మంచి పేరొచ్చింది. ఆ తర్వాత అలాంటి పేరు తెచ్చే చిత్రాలు వస్తాయని ఆశించాను. అయితే నేను కోరుకున్నట్లు జరగలేదు. వచ్చే అవకాశాలేవీ నన్ను ఆకట్టుకోలేదు. అలా రెండు మూడేండ్లకో సినిమా చేస్తూ వచ్చాను. ప్రతిసారీ నా సెకండ్ ఇన్నింగ్స్ సినిమా అనేవారు. కానీ మరోసారి నా కెరీర్‌ను నిలబెట్టే సినిమా రాలేదు. అయినా అవకాశాల పట్ల ఆశాభావంతోనే ఉన్నాను’ అని చెప్పుకుంది. తెలుగులో ‘పిలిస్తే పలుకుతా’ అనే సినిమాలో నటించింది షమితా. ప్రస్తుతం ఆమె ఖాతాలో ‘ద టినెంట్’ అనే చిత్రం ఉంది.