‘డివోషనల్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన స్క్రిప్ట్ ఇది. కథ బాగా నచ్చడంతో చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చాం. మొదట్లో చిన్న బడ్జెట్లో చేద్దాం అనుకున్నాం కానీ, కథ డిమాండ్ మేరకు బడ్జెట్ పెంచక తప్పలేదు. హై క్వాలిటీతో సినిమాను నిర్మించాం. ఇప్పటికే బిజినెస్ పరంగా సేఫ్ జోన్లోకి వచ్చేశాం. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారానే 80శాతం రికవరీ వచ్చేసింది. ఇంకో 20శాతం రికవరీ అయితే.. థియేట్రికల్ రన్‌తో లాభాల్లోకి వస్తామని నమ్మకంతో ఉన్నాం.’ అని నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి అన్నారు.
ఆది సాయికుమార్ హీరోగా వారు నిర్మించిన చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకుడు. అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ కీలక పాత్రధారులు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు. మహీధర్‌రెడ్డి మాట్లాడారు.
తెలుగులో రిలీజైన వారానికి హిందీలోనూ సినిమాను విడుదల చేస్తామని, దర్శకుడు యుగంధర్ ముని షాట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా బావుంటాయని, అన్ని ఎలిమెంట్స్‌తో అద్భుతంగా సినిమాను మలిచారని నిర్మాతలు తెలిపారు. ‘కల్కి 2898ఏడీ’ తర్వాతే ‘శంబాల’ పేరు అందరికీ తెలిసింది. నిజానికి ‘శంబాల’ అనే పేరుకు అర్థం ఉంది. దాని అర్థం ఏంటో.. ఆ ప్లేస్ ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. హారర్, సస్పెన్స్ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ వారు రిలీజ్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.’ అని నిర్మాతలు ఆనందం వెలిబుచ్చారు.