Shama Sikander : కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా తాజాగా ప్రముఖ టీవీ నటి షమ సికిందర్ సంచలన ఆరోపణలు చేశారు. వాణిజ్య ప్రకటన షూటింగ్లో ఓ స్టార్ నటుడు తనను అభ్యంతరకరంగా కౌగిలించుకున్నాడని ఆమె ఆరోపించారు. సన్నివేశం బాగా రావాలనే సాకుతో ఆయన అనూహ్యంగా తనను హగ్ చేసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో అతడితో కలిసి తాను నటించబోనని షమ సికిందర్ స్పష్టం చేశారు.
షూటింగ్లో భాగంగా సదరు నటుడు తనను హగ్ చేసుకోలేదని, వేరే ఉద్దేశంతోనే అలా చేశాడని వివరించారు. అతడు తనను హగ్ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తాను అసౌకర్యంగా భావించానని చెప్పుకొచ్చారు. తాను ఎంతోమందితో కలిసి పనిచేశానని, తనకు ఎంతో మంది మగవారితో స్నేహాలు ఉన్నా వారెన్నడూ ఇలా తనను అసౌకర్యానికి గురిచేయలేదని తెలిపారు. ఆ నటుడు చేసిన పనికి తాను షాక్‌కు గురయ్యానని గుర్తుచేసుకున్నారు. ఆ నటుడు సూపర్ స్టార్ అని, అలాంటి వ్యక్తి ఇంత దిగజారుడుగా ఎందుకు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన జీవితంలో ఇది ఎంతో దిగ్భ్రాంతికర ఘటనని ఆమె పేర్కొన్నారు. తాను ఆ వ్యక్తిని తొలిసారి కలుసుకున్నానని, అతడు సాధారణంగా కనిపించలేదని, యాటిట్యూడ్‌తో ప్రవర్తించారని అన్నారు. ఇక అతడితో తన జీవితంలో ఎన్నడూ కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేశారు. షమ సికిందర్ యే మేరి లైఫ్ హై, బట్లీవాలా హౌస్ నెంబర్ 43, కాజల్, సెవెన్, బాల్ వీర్ వంటి టీవీ షోస్‌లో ప్రముఖ పాత్రలో నటించారు. వెబ్ సిరీస్ మాయా : స్లేవ్ ఆఫ్ హర్ డిజైర్స్ వంటి షోలతో ప్రేక్షకుల్లో షమ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Read More :
American Scientist | మరణమే చివరి అంకం కాదు..! చావు తర్వాత కూడా మూడో దశ ఉంది..!!