Dunki Movie Shooting | ఇండియాలో ఉన్న గొప్ప దర్శకులలో రాజ్ కుమార్ హిరానీ ఒకరు. ఐఎమ్‌డీబీ వరల్డ్ టాప్ 10 దర్శకులలో రాజ్‌కుమార్ రెండవ స్థానంలో ఉన్నాడంటే ఈయన ఎంత గొప్ప దర్శకుడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించింది కేవలం 5 సినిమాలు మాత్రమే. కానీ ఆ 5 సినిమాలు ఒక్కో జానర్లో ఉంటాయి. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను సాధించాయి. అంతేకాకుండా ప్రతి సినిమాలో సందేశాన్ని పంచుతూ ఉంటాడు. కేవలం ఈయన కోసమే థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. 2018లో వచ్చిన ‘సంజు’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుంచి సినిమా రాలేదు. కాగా ఐదేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్‌తో డంకీ సినిమా చేస్తున్నాడు.
ఇటీవలే ‘పఠాన్’తో తిరుగులేని విజయాన్నందుకున్న షారుఖ్ ప్రస్తుతం అదే జోష్‌తో ‘డంకీ’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతుంది. కాగా కాశ్మీర్ షెడ్యూల్లో ఓ మేజర్ అండర్ వాటర్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది యాక్షన్ సీన్ కాదట. సినిమాలో కీలక సన్నివేశం ఇదని, కథను ముందుకు తీసుకెళ్లే సీన్ అని తెలుస్తుంది. అంతేకాకుండా దీంతో కాశ్మీర్ షెడ్యూల్ కూడా పూర్తవుతుందని సమాచారం.
సామాజిక ఇబ్బందుల గురించి ఈ సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా తాప్సీ పన్ను హీరోయిన్గా నటిస్తుంది. ఇక రాజ్ కుమార్ హిరానీ ఇండస్ట్రీకి వచ్చినప్పటినుంచి షారుఖ్‌తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించాడట. కానీ కుదరలేదట. ఎట్టకేలకు ఇన్నాళ్లకు రాజ్‌కుమార్, షారూఖ్‌తో కలిసి పనిచేయనున్నాడు. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి.