Shah Rukh Khan | బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ 59 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా కనిపిస్తారు. ముఖంలో కూడా వయసు తాలూకు ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇప్పటికీ సిక్స్‌ప్యాక్ మెయిన్‌టెయిన్ చేసే అగ్రహీరోల్లో ఆయన ఒకరు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాలు, ఆహారపు అలవాట్ల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ధూమపానం మానేసినప్పటి నుంచి తన ఆరోగ్యంలో పాజిటివ్ మార్పులు చోటుచేసుకున్నాయని, అలాగే మితాహారం తీసుకోవడం వల్ల శరీర ఆకృతిని ఒకే రీతిన ఉంచుకోవడం వీలవుతున్నదని చెప్పారు.
‘నేను రోజూ రెండు పూటలు మాత్రమే భోజనం చేస్తా. చిరుతిళ్ల జోలికి అస్సలు వెళ్లను. ఆహారంలో కూడా తృణధాన్యాలు, గ్రిల్డ్ చికెన్, బ్రోకోలి, పప్పుతో చేసే కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటా. భోజనం చాలా సింపుల్‌గా ఉంటేనే ఇష్టపడతా’ అని చెప్పారు. అయితే ఎక్కడికైనా అతిథిగా వెళ్లినప్పుడు మాత్రం వారు ఆఫర్ చేసినవన్నీ వొద్దనకుంటా ఆరగిస్తానని, ఆతిథ్యం స్వీకరించినప్పుడు ఇతరులను నొప్పించడం సరికాదని షారుఖ్‌ఖాన్ చెప్పుకొచ్చారు.
అన్నింటికంటే ముఖ్యంగా తాను కేవలం ఐదు గంటలు మాత్రమే నిద్రపోతానని, షూటింగ్ ముగించుకొని ఎంత రాత్రి ఇంటికొచ్చినా ఓ గంట సేపు వర్కవుట్స్ చేశాకే నిద్రకు ఉపక్రమిస్తానని షారుఖ్ తెలిపారు. మితాహారం తీసుకుంటూ, వారానికి నాలుగైదుసార్లు వర్కవుట్స్ మీద దృష్టిపెడితే వయసును దాచడం ఎవరికైనా పెద్ద సమస్యకాదని ఆయన చెప్పారు.