ShahRukhKhan | ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సైయారా’ (Saiyaara) ప్రమోషన్ స్ట్రాటజీపై ప్రశంసల వర్షం కురిపించాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. సాధారణంగా ఒక సినిమా వస్తోందంటే హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు, ఈవెంట్లు అంటూ నానా హంగామా చేయడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా విషయంలో మోహిత్ సూరి అనుసరించిన ‘నో-హైప్’ విధానాన్ని షారుఖ్ ఖాన్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ సినిమాతో అహాన్ పాండే, అనీత్ పడ్డా అనే ఇద్దరు కొత్త నటీనటులు బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. అయితే సినిమా విడుదలకు ముందు ఈ ఇద్దరు కొత్త నటీనటులను మీడియాకు, ఇంటర్వ్యూలకు పూర్తిగా దూరంగా ఉంచారు. కొత్త నటీనటులు అయినప్పుడు వారికి ఇంకా ఎలాంటి సినిమా చరిత్ర ఉండదు కాబట్టి, మీడియా అడిగే రొటీన్ ప్రశ్నలకు వారు సమాధానం చెప్పడం కంటే.. వారి పాత్రలే నేరుగా వెండితెరపై మాట్లాడితే బాగుంటుందని భావించిన దర్శకుడు ఈ వ్యూహాత్మక మౌనాన్ని పాటించారు.
అయితే దర్శకుడు మోహిత్ సూరి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సిద్ధార్థ్ ఆనంద్ దీపావళి పార్టీలో తనకు షారుఖ్ ఖాన్ ఎదురయ్యారని చెప్పారు. ఆ పార్టీలో తనను కలిసినప్పుడు షారుఖ్ ఖాన్.. ఆ ఇద్దరు కొత్త నటీనటులను ప్రమోషన్ల హడావుడికి దూరంగా ఉంచి సినిమాను సైలెంట్‌గా జనాల్లోకి తీసుకెళ్లడమే దర్శకుడిగా ఆయన చేసిన ‘అత్యుత్తమమైన పని’ అని ప్రశంసించినట్లు మోహిత్ సూరి చెప్పుకొచ్చారు. పీఆర్ స్టంట్ల కోసం పెట్టాల్సిన ఖర్చును మోహిత్ సూరి సినిమా సంగీతాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఉపయోగించారు. ఈ సినిమాలోని పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఫలితంగా ఎటువంటి భారీ అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 570 కోట్ల భారీ వసూళ్లను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది.