Shah Rukh Khan | ‘23ఏళ్లకే నటుడ్నయ్యాను. 27ఏళ్లకు హీరోని అయ్యాను. నటుడిగా 36ఏళ్ల ప్రయాణం నాది. దేవుడు అద్భుతమైన జీవితాన్నిచ్చాడు. కోట్లాది అభిమానులను ఇచ్చాడు. సంపదను కూడా కావాల్సినదానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇక నా ఒకే ఒక కోరిక మిగిలివుంది. లొకేషన్లో నటిస్తూ చనిపోవాలి. అదే నా ఆఖరి కోరిక.’ అన్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్.
లోకర్నో ఫిల్మ్ ఫెస్టివెల్లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ ‘జీవితాంతం నటుడిగానే కొనసాగాలనుకుంటున్నా. ఏదైనా సినిమా సెట్లో దర్శకుడు ‘యాక్షన్’ చెప్పగానే నేను చనిపోవాలి. వాళ్లు ‘కట్’ చెప్పాక కూడా లేవకూడదు.’ అంటూ నవ్వుతూ చెప్పారు షారుక్. సినీ రంగానికి చేస్తున్న సేవలకు గాను లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో షారుక్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందించారు. ఈ గౌరవాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నానని ఈ సందర్భంగా షారుక్ అన్నారు.