Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం కింగ్. బాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తుండగా.. సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ బచ్చన్ విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్ వంటి తారలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్లో షారుఖ్ గాయపడినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.
‘కింగ్’ సినిమా సెట్స్‌లో షారుఖ్‌కి గాయాలయ్యాయని, ఒక నెల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు విన్న షారుఖ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ వార్తలకు సంబంధించి షారుఖ్ ఖాన్ పర్సనల్ మేనేజర్ పూజ దాద్లానీ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు.